నేతల నోట బూతు పదాలేంది?: వెంకయ్యనాయుడు

నేతల నోట బూతు పదాలేంది?: వెంకయ్యనాయుడు

బషీర్ బాగ్, వెలుగు: తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు చాటిన మహనీయుడు ఎన్టీఆర్​అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల ముగింపు సభ ఘనంగా జరిగింది. కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిన్నెర - ఎన్టీఆర్ భాషా సేవ పురస్కారాన్ని ఏపీ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్​కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుద్ధప్రసాద్​కు పురస్కారం అందజేయడం హర్షణీయం  అన్నారు. మండలి బుద్ధప్రసాద్  తెలుగు భాష పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలుగులో ఛందస్సు ఒక పెద్ద మేధస్సు అని,  తెలుగు రోత కాదు.. అది మెదడుకు మేత అని తెలిపారు. ఇలాంటి అమ్మ భాషంటే నేటి యువతకు ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సీఎం పేషీ నుంచి ఊరిలో పంచాయతీ వరకు పాలన వ్యవహారాలు తెలుగులోనే జరిపించారని గుర్తు చేశారు. 

పాలన వ్యవహారాల్లోనూ తెలుగు వాడకాన్ని తప్పనిసరి చేసి సామాన్య ప్రజల్లో ప్రభుత్వ వ్యవహారాల పట్ల చైతన్యం తీసుకువచ్చారన్నారు. నిమ్మకూరు అనే పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా, దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మేటి నేతగా ఎదగడం సామాన్య విషయం కాదన్నారు. ఎవరికి వారు తమ మాతృ భాషను ప్రేమించాలని, వేరే భాషలను చులకన చేయకుండా సముచిత గౌరవం ఇవ్వాలని సూచించారు. నేటి రాజకీయాల్లో బూతు పదాలు వాడుక భాషగా మారిందని, ఈ భాషను ఉపయోగిస్తున్న నాయకుల తీరును ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే అన్నారు.  బూతు పదాలను ఉపయోగించే నాయకులు పద్ధతి మార్చుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి సభాధ్యక్షుడిగా వహించారు. ఈ సభలో జస్టిస్ భవాని ప్రసాద్, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి సుబ్రమణ్యం, సాహిత్యవేత్త వోలేటి పార్వతీశం, కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ కార్యదర్శి మద్దాళి రఘురాం తదితరులు పాల్గొన్నారు.