వ్యవసాయ ప్రధాన దేశంలో.. సాగు ఎందుకు నిస్సహాయంగా ఉంటోంది? రైతు ఎందుకు అలమటిస్తున్నాడు? సమతుల ఆహారానికి ఎందుకు కొరత? సగటు ప్రజల ఆరోగ్యం ఎందుకు దయనీయంగా మారింది? ఇవన్నీ జవాబు కావాల్సిన ప్రశ్నలే! సమాధానం తెలుసుకునే చిత్తశుద్ధి ఉన్నవారెవరైనా సమస్య మూలాల్లోకి వెళ్లాలి. ఈ రోజు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పలు పార్శ్వాలున్నా అందులో విత్తన సమస్య ప్రధానమైనది. వ్యవసాయానికి ప్రాణాధారమైనవి విత్తనాలు. అంతటి విత్తనం... సంకరమైంది, రసాయనమైంది, ఖరీదైంది, కలుషితమైంది. శతాబ్దాలపాటు రైతు సంరక్షణలో స్వచ్ఛంగా, భద్రంగా ఉన్న విత్తనం నేడు చేజారి కంపెనీలు, కార్పొరేట్ల గుప్పిట చేరింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో రైతులు తమ సొంత విత్తన పరిజ్ఞానాన్ని, అభ్యాసాలను మరచిపోయిన పరిస్థితి! విత్తనాన్ని చెరబట్టిన కంపెనీల గుత్తాధిపత్యపు ముంగిట్లో ఏయేటికాయేడు క్యూ కట్టాల్సిన దుస్థితి. ఈ దురవస్థ మారాలి. విత్తన స్వావలంబన రైతుది కావాలి. విత్తనాలను, విత్తన పరిజ్ఞానాన్ని, మంచి అభ్యాసాలను రైతులు పరస్పరం పంచుకోవాలి. అందుకే విత్తన పండుగ. అది వ్యవసాయానికో వేడుక!
‘ఆహారం ఒక చేత్తో, ఔషధాలు మరో చేత్తో తినే దుస్థితి నుంచి మనిషి బయటపడాలి’ అని మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి మాటలు అందరిలో ఆలోచన రేకెత్తించేవే! దేశంలో సగటు మనిషి ఆరోగ్యం కుంటుబడి అలమటిస్తుంటే ప్రయివేటు వైద్యరంగం మూడు పువ్వులు -ఆరు కాయలుగా ఎందుకు విరాజిల్లుతోంది? ఇది ఎవరమైనా కాస్త మనసుపెట్టి ఆలోచించాల్సిన విషయం. భారతదేశపు రైతు ఆత్మహత్యల్లో అత్యధికం వారి వ్యవసాయేతర వ్యయాలకు తెచ్చిన అప్పుల-వడ్డీల భారం వల్లేనని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది.
పిల్లల చదువులకో, కుటుంబ సభ్యుల వైద్య అత్యవసరాలకో రైతు తెచ్చిన అప్పులు తీర్చలేని భారమవుతున్నాయి. నిజమే. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు అసాధారణంగా పెరిగి, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీస మద్దతు ధర కూడా లభించని దయనీయ స్థితి! అదే సమయంలో, మనిషి బలీయ మనోభావాలతో ముడివడి ఉండే విద్య, వైద్యం ప్రధానంగా ఈ దేశంలో ప్రయివేటు రంగంలో ఉన్నాయి. జపాన్, కొరియా వంటి తూర్పు దేశాల్లోగాని, అమెరికా, ఐరోపా సంఘం వంటి పశ్చిమ దేశాల్లోగాని ప్రభుత్వాల సామాజిక భద్రతాంశాల్లో విద్య, వైద్యం తప్పనిసరి. కానీ, మన దేశంలో ప్రభుత్వాలు ఆ రెండు అంశాలను మొక్కుబడిగా నిర్వహిస్తూ ఎక్కువ పాత్రను ప్రయివేటు రంగానికి వదిలేశాయి. దాంతో, విద్య, వైద్య రంగాలు పచ్చి వ్యాపారమయ్యాయి. మనిషి ఆరోగ్యానికి మూలం ఆహారం, ఆహారపు అలవాట్లు! విత్తనం ఆహార నాణ్యతను నిర్దేశిస్తుంది. కాలక్రమంలో విత్తనం సంకరమై, జన్యువికల్పమై, రసాయనమై మన ఆహార నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఫలితంగా ఆరోగ్యం చెడుతోంది. అందుకే, ఆహారంతో పోటీగా ఔషధాల్ని తినాల్సివస్తోంది.
దేశీ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం
సాగురంగం ఇవాళ ఎదుర్కొంటున్న సవాళ్లకు దేశీ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం సమాధానాలు. కొంత సమయం తీసుకున్నా అవే వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే పరిష్కారాలు. ముఖ్యంగా ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాలకు తట్టుకోగలిగే సామర్థ్యం సహజమైన దేశీ విత్తనాలకే తప్ప జన్యు, రసాయన సంకర విత్తనాలకుండదు. నేల సారాన్ని కాపాడుకుంటూ సాగు పద్ధతుల్ని మార్చుకోవడం ద్వారానే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఇందుకు సంప్రదాయ విత్తనాలు ముఖ్యం. అవి మంచి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మానవ ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు కారణమవుతాయి. అలా వ్యవసాయాన్ని సుస్థిరపరుస్తాయి. అందుకు ప్రభుత్వాల ప్రోత్సాహం అవసరం. రఘువీరారెడ్డి చెప్పిన మరో మంచి మాట, ‘దేశీ విత్తనాలను వాడి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహారోత్పత్తికి దోహదపడే రైతుల ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రత్యేక కనీస మద్దతు ధరని ప్రకటించి, అమలు చేయాలి’ అనటం. ‘రోగరహిత జీవనానికి దేశీ విత్తనాలే దిక్కు’ అనే అంశంపై కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఏర్పాటు చేసిన కార్యశాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయనీ ప్రసంగం చేశారు. 1960 లలో నాటి కరువు, ఆహారధాన్యాల కొరత దృష్ట్యా నాటి ప్రధాని ఇందిరాగాంధీ, వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్ వంటి వారు అధిక ఆహారోత్పత్తి గురించి ఆలోచించాల్సిరావటం ఆనాటి అవసరంగానే తప్ప నేటి ఆవశ్యకతగా గుర్తించలేమన్నారు. ఆరోగ్యాన్నిచ్చే స్వచ్ఛమైన ఆహారం కోసం దేశీ విత్తనాల్ని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆధారపడటం నేటి అవసరమని ఆయన ఉద్బోధించారు. ‘విత్తన పండుగ’ల నిర్వహణకు చొరవ చూపుతున్న రైతు సంఘాలను, స్వచ్ఛంద సంస్థల్ని బాధ్యతగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలనీ కర్తవ్య బోధ చేశారు.
పండుగలు జ్ఞాన కేంద్రాలు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తరచూ నిర్వహిస్తున్న విత్తన మేళాలు, విత్తనోత్సవాలు, విత్తన పండుగలు ఒకరకంగా రైతులకు జ్ఞానాన్ని అందించే విజ్ఞాన కేంద్రాలు. విత్తన జ్ఞానం, విత్తనాల సమాచారం రైతులకు చేరాల్సిన పరిస్థితుల్లో ప్రయివేటు గుత్తాధిపత్యం పెరిగింది. విత్తన జ్ఞానం రహస్యంగా మారుతోంది. విస్తరిస్తున్న వ్యాపార క్రమంలో పెరుగుతున్న విత్తన పరిశోధన సమాచారం కొందరి చేతుల్లో వ్యాపార వస్తువుగా మారుతోంది. అందరికీ చెందాల్సిన సమాచారం, విత్తన జ్ఞానం కొందరికే పరిమితమవుతున్న తీరును ప్రభుత్వ వ్యవస్థలు నియంత్రించలేకపోతున్నాయి . హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సీజీఆర్, అఖిల భారత స్థాయి సంస్థ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్‌తో కలిసి మూడు రోజుల విత్తన పండుగను శ్రీశైలం జాతీయ రహదారిపైనున్న కడ్తాల్ సమీపంలోని అన్మాస్‌పల్లి (ఎర్త్‌సెంటర్) లో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో నిర్వహిస్తోంది. తెలంగాణలో విత్తనాల పండుగ గత సంవత్సరం ప్రారంభించగా ఇది రెండో పండుగ. సుమారు 15 రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొంటున్నారు. 70కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, పీపుల్స్‌పల్స్ వంటి ఇరవై ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ ఉత్సవాల భాగస్వాములుగా ఉన్నారు. విత్తనోత్సవాలు రైతులు తమ విత్తనాలు, ఉత్పత్తులనే కాకుండా ఆలోచనలు, -అనుభవాలను పంచుకునే వేదికలు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు తమ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, విత్తన సంరక్షణ విధానాలను పరస్పరం పంచుకుంటారు. ప్లీనరీ సెషన్‌తోపాటు ప్రకృతి వ్యవసాయం, మిశ్రమ పంటల సాగు, సహజ పెస్ట్ నిర్వహణ వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమాల్ని కూడా నిర్వాహకులు ఏర్పాటుచేస్తున్నారు. విభిన్న రాష్ట్రాలు, వేర్వేరు ప్రాంతాల రైతులు పరస్పరం సహకారం అందించుకొని, లబ్ధి పొందేందుకు ‘నెట్‌వర్కింగ్’ సదుపాయాన్నీ కల్పిస్తున్నారు. ఇది రైతుల సామూహిక బలాన్ని పెంచుతుంది.
పెరిగే ఆసక్తిని నిలబెట్టాలి
వాతావరణ మార్పులవల్ల అతి వర్షాలు, వరదలు, కరువులు వంటి తీవ్ర ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచ వ్యవసాయం, ఆహార భద్రత, ఆరోగ్య పరిస్థితుల గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక (యూఎన్‌సీటీఏడీ) ప్రకారం ఆసియా, ఆఫ్రికా, మధ్య అమెరికాలోని కొన్ని ఆధునిక వ్యవసాయ ప్రాంతాల్లో ఆహారోత్పత్తి సగానికి పైగా క్షీణించే ప్రమాదముంది. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు అవసరం. వాతావరణ మార్పులను తట్టుకోగల పునరుత్పత్తి వ్యవసాయ వ్యవస్థవైపు మారాలని యూఎన్ నివేదిక సూచిస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మన దేశంలో దేశీయ సంప్రదాయ విత్తనాలపైన, రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయంపైన ఆసక్తి పెరుగుతోంది. గత సంవత్సరం విత్తన పండుగలో ఒకరోజు వెయ్యి మందికి పైగా స్టాల్స్‌ను సందర్శించారు. ప్రకృతి విపత్తులను, కరువు, వరద వంటి వైవిధ్య పరిస్థితులను, చీడపీడలను తట్టుకోగల శక్తి దేశీయ విత్తనాలకు మాత్రమే ఉందని నమ్మి రైతులు, పరిశోధకులు, సాధారణ వ్యక్తులు, సంస్థలు ఆ దిశలో కృషి చేస్తున్నాయి. విత్తన పండుగ కేవలం ఉత్సవం కాదు. దీని వెనుక అయిదు బలమైన లక్ష్యాలున్నాయి. సంప్రదాయ జ్ఞానంతో సహా దేశీ విత్తనాల్ని రైతే కాపాడుకోవడం. సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధిపరచడం. ఆహార భద్రతకు తోడ్పడటం. ప్రజల ఆరోగ్యాల్ని సంరక్షించడం, రైతు శ్రేయస్సుకు భరోసా కల్పించడం.
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
