తమిళనాడులో విజయ్ సృష్టించిన రికార్డు విశేషాలనే మనం చర్చిస్తున్నాం. నిజానికి స్టాలిన్ గురించి కూడా అంతకంటే గొప్పగానే మాట్లాడుకోవాలి. స్టాలిన్ అధికారం కోసం అనైతిక రాజకీయాలపై ఏమాత్రం ధ్యాస పెట్టకుండా పాలిటిక్స్‌లో ఆరోగ్యకరంగా, ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ఫెయిర్‌గా తమిళనాట చక్కని పాత్రలో నవీన, సమకాలీన రాజకీయాలకు చిరునామాగా నిలుస్తున్నారు.
స్టాలిన్ తాను 2021లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించగానే చాలా హుందాగా, బాధ్యతాయుతంగా, నిర్మలమైన పరిపాలనా విధానాలు అవలంబించారు. తమిళనాడులో అమ్మగా పేరొందిన జయలలిత పేరిట ఉన్న అమ్మ క్యాంటీన్లను అలానే ప్రజలకు అందుబాటులో ఉంచారు. పేరు, ఫొటోలు మార్చలేదు. జయలలిత ఫొటోలు గల సంక్షేమ పథకాల సామగ్రిని కూడా యథావిధిగా పంపిణీ చేయించారు. రాజకీయ ప్రచార యావ కోసం ప్రజాధనాన్ని ఎక్కడా వృథా కానివ్వలేదు. జయలలిత ఫొటోలపై ఈర్ష్య, అసూయ ద్వేషాలు తనలో పొడసూపనీయలేదు. ఆ విధంగానే కాదు, తమిళనాట సాధారణమైన కక్ష, ద్వేష పూరిత రాజకీయాల జోలికి పోలేదు.
స్వచ్ఛ రాజకీయం
ప్రతీకార చర్యలకు తన హయాంలో తావు లేకుండా వాటిని గతం చేశారు. తన పరిపాలనలో సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే నీటి ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు వంటి సౌలభ్యాలను దరిచేర్చారు. కొన్ని అంశాల్లో విభేదిస్తూ తన కచ్చితత్వంతో విమర్శలు ఎదుర్కొన్నారే కానీ, తమిళనాట పాలన, రాజకీయాలను భ్రష్టు పట్టించలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి, తన పార్టీ డీఎంకే ప్రధాన ప్రతిపక్షం స్థితిలోకి చేరింది. ఇక్కడ మరీ బాధాకరం ఏమంటే..అసెంబ్లీకి పోటీలో తాను స్వయంగా ఓటమి పాలవడం. అయినప్పటికీ తాను పోటీచేసి, పరాజయం పాలైన నియోజకవర్గానికి మరుసటి రోజే వెళ్ళారు. ప్రజలను కలిశారు.
ఓటేసిన పౌరులకు కృతజ్ఞతలు చెప్పారు. ఓడిపోయినప్పటికీ తమ వద్దకు స్టాలిన్ రావడంతో కార్యకర్తలు, ప్రజలు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన నాయకత్వానికి ఎదురైన చేదు అనుభవానికి చాలా దుఃఖించారు. పేరుకు తగ్గట్టుగానే ఉక్కు మనిషి అయినా స్టాలిన్ కూడా ఆ క్షణాల్లో భావోద్వేగానికి లోనైన సున్నిత మనస్కులు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యే కూడా కాదు. తన పార్టీ మాత్రం మెయిన్ అపోజిషన్. ఇటువంటి పరిస్థితుల్లోనూ తాను చాలా నిగ్రహంతో, హుందాగా, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారు.
వర్తమాన రాజకీయాలకు గొప్ప సందేశం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో, ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంలో టీవీకే విజయ్‌కి 10 మంది ఎమ్మెల్యేలు తక్కువై తమిళనాట రాజకీయ అనిశ్చితి ప్రస్తుతం నెలకొంది. ఈ స్థితిలో తనకు అవకాశం ఉన్నప్పటికీ రాజకీయంగా సొమ్ము చేసుకునే అనైతిక ఎత్తులపై స్టాలిన్ ఆసక్తి చూపడం లేదు.
కూటమి ధర్మాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీ స్టాలిన్‌ను సంప్రదించకుండానే విజయ్‌కి మద్దతు ప్రకటించింది. వామపక్షాలు, ఇతర రెండు పార్టీలతో స్టాలిన్ సమావేశమై టీవీకేకు మద్దతు అంశంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పడం ద్వారా తన పెద్ద మనసును చాటుకున్నారు. అత్యధిక స్థానాలు సాధించిన పార్టీయే పాలన చేయాలనే సూక్ష్మాన్ని, తమిళ ప్రజల తీర్పు సారాన్ని గౌరవిస్తూ అందుకు అనుగుణంగానే ఆయన ప్రతి దశలోనూ వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమంత్రి అనుభవం, వాస్తవ ఖజానా పరిస్థితి ప్రకారం విజయ్‌కి చక్కని సలహాలు ఇస్తున్నారు. నెలకు తాను ఇచ్చినట్లు మహిళలకు రూ. వెయ్యి ఇవ్వాలనీ, విజయ్ ఇచ్చిన రూ. 2,500 హామీ ఇప్పటికిప్పుడు తనకు సాధ్యం కాకపోవచ్చనే సానుకూల దృక్పథంతో సూచనలు ఇస్తున్నారు. అంటే, దురాశ, దురాలోచన, అధికార దాహం తనలో ఏమాత్రం లేదని ఈ విధంగానూ స్టాలిన్ సంకేతం ఇచ్చారు. తమ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగానే, ప్రజాతీర్పుతోనే తిరిగి అధికారంలోకి రావాలే కానీ, ఇతరత్రా మార్గాల్లో కాదని వర్తమాన రాజకీయాలకు గొప్ప సందేశం ఇస్తోన్న స్టాలిన్ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.
ఇల్లెందుల దుర్గాప్రసాద్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
