భారత రాజకీయాలు ఒక సంక్లిష్ట దశ గుండా నడుస్తున్న తరుణంలో ‘ఇండియా’ విపక్ష కూటమి ఒక సంక్షోభ కూడలిలో నిల్చొని ఉంది. ‘భారత జాతీయ అభివృద్ధికర సమ్మిళిత కూటమి’ (ఇండియా) అనే తన పేరులోని ‘సమ్మిళిత’ భావననే సందేహంలో పడవేసే పరిస్థితులు ఇంకా ఈ కూటమిని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమి నీడలోనే రెండు భిన్నమైన సంకేతాలు వెలువడ్డాయి. విపక్ష కూటమిని బలోపేతం చేస్తాయేమోనన్న ఆశ ఒక వైపు, మరింత బలహీన పరుస్తాయోమోనన్న సందేహం మరోవైపు ప్రస్ఫుటమౌతోంది. అందుకే, ఇది విపక్షాలు సంక్షోభిత కూడలిలో నిల్చున్న పరిస్థితి.
‘వదిలేది లేదు, పోరాడుతాను ఇండియా కూటమిని బలోపేతం చేస్తాను’ అని బెంగాల్‌లో భంగపడిన మమతా బెనర్జీ (టీఎంసీ) అంటే, ‘తొందరపాటు చర్య ద్వారా తమిళనాట కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి, ఇవి ఇండియా కూటమిని బలహీనపరుస్తాయి’అని డీఎంకే (స్టాలిన్) పేర్కొంది. దేశమంతా అప్రతిహతంగా విస్తరిస్తున్న బీజేపీని నిలువరించేందుకు వ్యూహాత్మకంగా జట్టుకట్టిన ‘ఇండియా’ కూటమి అప్పుడు, ఇప్పుడూ వ్యూహ తప్పిదాలతోనే కట్టు తప్పుతోంది, పట్టు సడలిస్తోంది. ‘ఏమిటి కింకర్తవ్యం?’ అన్నది ఎప్ప్పుడూ ప్రశ్నార్థకంగానే మిగులుతోంది.
తమిళనాడులో కాంగ్రెస్ చర్య తప్పు కాకపోవచ్చు, కానీ, తీరు ముమ్మాటికీ తప్పే! ‘లౌకిక ప్రగతిశీల కూటమి’ (ఎస్సీయే) ప్రధాన భాగస్వామిగా ఉన్న డీఎంకేతో సంప్రదించకుండా, కనీసం మాట మాత్రం చెప్పకుండా ఏకపక్షంగా విజయ్‌కి (టీవీకే) కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం కూటమి ధర్మానికి విరుద్ధం. అందుకే, ఈ చర్యను ‘వెన్నుపోటు’గా డీఎంకే భావించింది. ఇటువంటి విశ్వాసరాహిత్యం సమస్య ఇదివరకూ ఇండియా కూటమి ఇతర పక్షాలకు- కాంగ్రెస్‌పార్టీకి మధ్య తలెత్తింది. ఫలితంగా హర్యానాలో ‘ఆప్’తో, బెంగాల్‌లో ‘టీఎంసీ’తో పొత్తు లేకుండానే పోటీచేయాల్సి వచ్చింది. పొత్తులున్న బిహార్‌లో ఆర్జేడీతో, ఉత్తరప్రదేశ్‌లో ‘ఎస్పీ’తో పరస్పర అనుమానాలు, అపోహలతోనే సాగాల్సి వచ్చింది.
‘మతతత్వ బీజేపీ, ఆర్‌ఎస్సెస్ దొడ్డిదారి ఆధిపత్యాన్ని తమిళనాట అడ్డుకునేందుకే విజయ్‌కి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది’అని తర్వాత కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ‘విజయ్‌కు మద్దతు విషయంలో మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి’ అని ఎస్పీయే ఇతర భాగస్వామ్యులైన సీపీఐ, సీపీఎం, ముస్లీంలీగ్ (ఐయుఎంఎల్) పార్టీలను తనతో భేటీ సందర్భంగా స్టాలిన్ (డీఎంకే) కోరారంటే కాంగ్రెస్‌తో సహా అందరిదీ ఒకే ఆలోచన. ‘అతి పెద్ద పార్టీగా ప్రజాతీర్పు ప్రకారం విజయ్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలి. మేం ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధం, ఆరుమాసాల వరకు ఏమీ అనబోం?’ అన్న స్టాలిన్ ప్రకటన కూడా ఆ దారిలోదే! అందరూ మాట్లాడుకొని అడుగులు వేసుంటే సరిపోయేది.
అనైక్య విపక్షం బీజేపీకే లాభం
విపక్ష పార్టీలు అన్నిటి మధ్య సిద్ధాంత సారూప్యత అసాధ్యం. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇతర స్థానిక, ప్రాంతీయ పార్టీలకు ఈ విషయంలో స్పష్టమైన వైవిధ్యాలున్నాయి. అక్కడక్కడ వైరుధ్యాలూ ఉన్నాయి. కానీ, బీజేపీని, దాని విస్తరణను అడ్డుకోవడానికి ఆయా విపక్ష పార్టీల మధ్య సయోధ్య, ఐక్యత, సమన్వయం అవసరం. ఆ విషయాన్ని గ్రహించడం, గ్రహించి అంగీకరించడం, అంగీకరించాక అందుకనుగుణంగా నడుచుకోవడం ‘ఇండియా’ పక్షాలకు తక్షణావసరం.
అది లేకపోవడం వల్లే ‘సర్’ పేరిట 27 లక్షల మంది ఓటర్ల రాజ్యాంగపు హక్కును అన్యాయంగా కాలరాసినా ఏమీ చేయలేని అశక్తత! అందుకనేమో, ‘ఇండియా కూటమి’ని బలోపేతం చేస్తానని, కాంగ్రెస్‌తో పొత్తు కూడా పెట్టుకోకుండా నిన్న బెంగాల్ బరిలో పోరిన మమత తాజాగా ప్రకటించారు. ఓటమి తర్వాత అఖిలేశ్ యాదవ్(ఎస్పీ) ఆమెను కలిసి ‘మీరు ఓడలేదు’ అని అనునయిస్తూ తమ సంఘీభావం ప్రకటించారు.
ప్రజాస్వామ్య పటిష్టతను విశ్వసించే భారత ప్రజలు ఓటర్లుగా కూడా ఒక సుస్థిర, ఐక్య, విశ్వసనీయ ప్రత్యామ్నాయం తమకు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అదొక ఆరోగ్యకర వాతావరణం. ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామం. ఓటరు అభీష్టం, అతని ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తగిన ప్రత్యామ్నాయం లేనందువల్లే ఒక పార్టీనో, కూటమినో ఎంచుకోవాల్సి వస్తే అది పాలనను ఏకస్వామ్యం వైపు నడుపుతుంది. కాలక్రమంలో అది ప్రజాస్వామ్యానికి చేటు. ఇండియా కూటమికి కేంద్ర బిందువుగా కాంగ్రెస్ రెండంచెల వ్యూహంతో, పట్టువిడుపు ధోరణితో వ్యవ హరించాలని మిత్రులు కోరుకోవడంలో తప్పులేదు.
ఎటువైపు ఈ పయనం
దేశం రెండ కొసల్లో ఉన్న అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సారూప్యత ఉంటే ఫలితాల్లో మాత్రం ఓ వైరుధ్యముంది. రెండుచోట్ల పాలక కూటములు మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు యత్నించడం సారూప్యత. కానీ, అస్సాంలో పాలక బీజేపీ నేతృత్వపు కూటమి (ఎన్‌ఈడిఏ) మళ్లీ గెలవటం, కేరళలో అధికార లెఫ్ట్ కూటమి (ఎల్డీఎఫ్) ఓడటం వైరుధ్యం రెండుచోట్లా స్పష్టమైన ఆధిక్యతతో ఫలితాలు వచ్చాయి. కేరళలో బలమైన ప్రత్యామ్నాయం ప్రజలకు అందుబాటులో ఉంది. అది అక్కడి దశాబ్ధాల రాజకీయ స్వభావం. అస్సాంలో ఆ పరిస్థితి లేదు. అటువంటి రాజకీయ స్వభావం అక్కడ ఇంకా స్థిరపడలేదు.
బీజేపీకి ఇది వరుసగా మూడో ప్రభుత్వం. అంతకుముందు కాంగ్రెస్ మూడు పర్యాయాలు అస్సాంలో వరుసగా గెలిచి తరుణ్ గొగొయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమ ఆధిపత్యం దేశ రాజకీయాల్లో మొదలైన నుంచి ‘కాంగ్రెస్ రహిత (కాంగ్రెస్ ముక్త్) భారత్’ సాధిస్తాం అని ప్రచారం చేస్తున్న బీజేపీ ఇప్పుడు ఆ దిశలో ఇంకో అడుగు ముందుకు వేసింది. ఒకటిన్నర దశాబ్దాల్లో కాంగ్రెస్‌ను రెండు, మూడు రాష్ట్రాల్లోనే పూర్తి సొంత ప్రభుత్వాల ఏర్పాటుకు పరిమితం చేయగలిగింది.
ప్రాంతీయ పక్షాలే బీజేపీ లక్ష్యం
2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ మిత్ర పక్షాలతో కూడి అనూహ్యంగా ఎదగడం (232–-293) ద్వారా, 400 సీట్ల బలవత్తర శక్తి కావాలని ఆశపడ్డ తమ ఎన్డీయేకు కేవలం 60 స్థానాల సమీపానికి రావడం బీజేపీ నాయకత్వాన్ని కలవరపరిచింది. అప్పట్నుంచి వారి ఎజెండాయే మారింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు దన్నుగా ఉన్న ప్రాంతీయ పక్షాలను లక్ష్యం చేసుకుంది. వారందరినీ దెబ్బతీయడం ద్వారా విపక్షాన్నే బలహీనపరచడమే ప్రధాన లక్ష్యమైంది. ఈడీ, సీబీఐ, కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం వంటి వేర్వేరు ప్రజాస్వామ్య సంస్థల నుంచి ప్రతిదాన్ని ఆయుధంగా మలచుకుంది.
2024 ఎన్నికల తర్వాత.. పశ్చిమంలో మహారాష్ట్ర (ఎన్సీపీ- శివసేన), ఉత్తరాన ఢిల్లీ, హర్యానా(ఆప్), బిహార్ (ఆర్జేడీ), తూర్పున పశ్చిమబెంగాల్ (టీఎంసీ), దక్షిణాన తమిళనాడు (డీఎంకే) రాష్ట్రాలను లక్ష్యం చేసుకుని పావులు కదిపింది. కేంద్రంలో తనకున్న అధికారం ఆసరా చేసుకుని సామ, దాన, బేధ, దండోపాయాల ద్వారా ‘ఇండియా కూటమి’ ని రాజ కీయంగా కకావికలం చేసే కృషిలో ముందడుగు సాధించింది. ఈ క్రమం ఇలాగే సాగితే ... బయటకు ప్రకటించకుండానే ‘ప్రతిపక్ష రహిత (విపక్షముక్త్) భారత్’ ఏర్పాటు కోరుకుంటోందా? అన్న అనుమానాలు తలెత్తడం సహజం! సంకేతాలలాగే ఉన్నాయి.
ప్రజాతీర్పులో పాఠాలున్నాయి
అయిదు అసెంబ్లీల ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీలు/ కూటములకు నేర్పిన ఉమ్మడి పాఠమొకటుంది. ప్రభుత్వాల పనితీరు బాగుంటే ప్రజలే ఆదరిస్తారు. లేకుంటే ఎన్ని కథలు, కథనాలు (న్యారేటివ్స్) వినిపించినా తిరస్కరిస్తారు. విశ్వాసం కలిగించే ప్రత్యామ్నాయం ఉంటే వాటినే ఎంచుకుంటారు. కక్ష గట్టి అధికార బలంతో అది కూడా లేకుండా చేస్తామంటే ప్రత్యామ్నాయాన్ని వారే ఎంపిక చేసుకుని, తెచ్చుకుంటారు. ఇదే సందేశం. ఓటర్లుగా జనం మన్నన పొందాలంటే రాజకీయ పార్టీలు తమ యుక్తులు, కుయుక్తులకన్నా ప్రజల ఆకాంక్షలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్నిచ్చారు.
2029 సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు దేశంలో ఓ డజన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. విస్తరణవాద ధోరణితో దేశం నలుదెసలకు (21/28 రాష్ట్రాలు) పరివ్యాప్తమౌతున్న బీజేపీని సమర్థంగా ఎదుర్కోవడానికి ‘ఇండియా కూటమి’ ఏ పంథా అనుసరిస్తుంది? ప్రత్యామ్నాయంగా నిలువగలుగుతుందా ? అన్నది కూడా దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఇది పాలక, విపక్షాలు గుర్తెరగాలి. గ్రీకు తాత్వికుడు ప్లాటో అన్నట్టు ‘అందుబాటులో ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుంటూ, గరిష్టంగా ఫలితాలు సాధించడమే రాజకీయం’ అన్నది నిన్న, ఇవాళ, రేపు కూడా కాలపరీక్షకు నిలవగలిగే వాస్తవం.
దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
