జనాలకే కరోనా రూల్స్.. లీడర్లకు కాదు..

జనాలకే కరోనా రూల్స్.. లీడర్లకు కాదు..

అడుగడుగునా రూల్స్ బ్రేక్‍
చావుకు20, పెళ్లికి 50మంది పబ్లిక్‍ దాటొద్దన్నరు
నేతలు మాత్రం వేలమందితో వేడుకల్లో పాల్గొంటున్నరు

‘కరోనా వైరస్‍కు ఇంకా మందు కనిపెట్టలే. మనకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మనమంతా కరోనాతో కలిసి కాపురం చేయాల్సి వస్తుంది. బతికుంటే బలుసాకు తినొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో లాక్‍డౌన్‍ రూల్స్ అతిక్రమించొద్దు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలే. ఇప్పుడున్న పరిస్థితిలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. కరోనా సోకకుండా ఎవరికివారు జాగ్రత్తగా ఉండాలే. అందరికి టెస్టులు చేయాలంటే చేయలేం. జనాలు ఎక్కడా గుంపులు గుంపులుగా తిరగొద్దు. సభలు సమావేశాలు పెట్టొద్దు. వంద శాతం ఫిజికల్‍ డిస్టెన్స్ మెయింటైన్‍ చేయాలే.’
‑పలు సందర్భాలలో సీఎం కేసీఆర్‍ చెప్పిన మాటలు

‘కరోనాపై ఎక్కువ టెస్టులు చేస్తే ప్రైజులు ఇవ్వరు. వ్యాక్సిన్‍ వచ్చేవరకు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలే. ప్రతి ఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలే.’

‑ఏప్రిల్‍ 26న కార్యకర్తలు, జనాలకు కేటీఆర్‍ సూచన

కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైంది. పల్లెలైనా, పట్నాలైనా క్షేమంగా ఉండే పరిస్థితి లేదు. వైరస్‍ను అస్సలు లైట్‍ తీస్కోవద్దు. జూన్‍, జులైలో కేసులు ఎక్కువగా వస్తయ్‍. ప్రజలు అప్రమత్తంగా ఉండాలే. తప్పనిసరిగా ఫిజికల్‍ డిస్టెన్స్ మెయింటైన్‍ చేస్తూ.. లాక్‍డౌన్‍ రూల్స్ పాటించాలే.

‑మే29న ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

వరంగల్‍ రూరల్‍, వెలుగు: కరోనా కట్టడి విషయంలో లీడర్లు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండట్లేదు. వైరస్‍కు వ్యాక్సిన్‍ వచ్చేవరకు జనాలు అవసరమనుకుంటే తప్ప గడప దాటవద్దని సీఎం సారే చెప్పారు. పెళ్లికి 50 మంది, చావుకు 20 మందికి మించి ఎక్కువగా రావద్దన్నారు. లాక్‍డౌన్‍ రూల్స్ అతిక్రమించొద్దని అడ్వైజ్‍ ఇచ్చారు. మాస్కులు పెట్టుకోవాలని, ఫిజికల్‍ డిస్టెన్స్ మెయింటైన్‍ చేయాలని సూచించారు. కానీ జనాలకు రోల్‍మాడల్‍గా ఉండాల్సిన అధికార పార్టీ మంత్రులు, పెద్దలీడర్లే కరోనా రూల్స్ అతిక్రమిస్తున్నారు.

9 రోజుల్లో 1,300 కేసులు.. 66 మరణాలు
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఎక్కువైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,320 పాజిటివ్ కేసులు నమోదవగా 165 మంది మరణించారు. గత 9 రోజుల్లోనే 1,300మందికి కరోనా సోకగా, ఏకంగా 66 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొదటి వెయ్యి కేసులు నమోదవడానికి 55 రోజులు పట్టగా..
తాజా మరో వెయ్యి (3 వేల నుంచి 4 వేలు) పెరగడానికి మాత్రం కేవలం 8 రోజులే పట్టింది. దీనిని బట్టి ప్రస్తుతం పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇలాంటి టైంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు కరోనా రూల్స్ పక్కన పెడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. మే 29న సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‍ చేతుల మీదుగా జరిగిన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి సుమారు 1500 మంది వచ్చారు. హైకమాండ్ ఆదేశమో, లోకల్ లీడర్ల అత్యుత్సాహమోగానీ ఆ రోజు రిజర్వాయర్ వద్ద జనజాతర కనిపించింది. సోషల్ డిస్టెన్స్ మాటమచ్చుకైనా లేదు. ఈ నెల 10న మినిస్టర్ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్లో నిర్వహించిన గోదావరి జలహారతి కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది దాకా తరలివచ్చారు. డప్పుచప్పుళ్ల నడుమ సాగిన ఈ ర్యాలీని చూస్తే మనం కరోనా కాలంలోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది. అధినేతల కార్యక్రమాల్లోనే కరోనా రూల్స్ ఇలా బ్రేక్ అవుతుండడంతో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత లైట్ తీసుకుంటున్నారు. కరోనా టైంలో వరంగల్ సిటీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరయ్యారు. దీనిపై పబ్లిక్‍ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆ తర్వాత జరిగిన గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్ మీటింగ్ను ఆఫీసర్లు వీడియో కాన్ఫరెన్స్ద్ ద్వారా నిర్వహించగా, జనాలు స్వాగతించారు. కానీ లీడర్లలో మాత్రం మార్పు కనిపించడం లేదు.

టెన్త్ పరీక్షలు క్యాన్సిల్.. రైతు సదస్సులు ఫుల్
కరోనాను డీల్ చేసే విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరు డిఫరెంట్ గా ఉంటోంది. వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందనే భయంతోనే టెన్త్ ఎగ్జామ్స్ ను మొదట వాయిదా వేసిన సర్కారు, తర్వాత క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కోగదిలో 30 నుంచి 40 మంది స్టూడెంట్లను కూర్చోబెట్టడం ద్వారా వైరస్‍వ్యాపించే ప్రమాదం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అదే టైంలో కొంపలు మునిగిపోతున్నట్లుగా షరతుల సాగుపై పెద్దఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఈ సదస్సుల్లో పార్టీ కార్యకర్తలు, రైతు సమన్వయ సమితి బాధ్యులు, రైతులు భారీగా పాల్గొన్నారు. అవగాహన సంగతేమో గానీ ఎంతమందికి కరోనా అంటిందోనని అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది. భయపడినట్లే ఇప్పుడు రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి .

కేటీఆర్‍ వరంగల్‍ టూర్‍పై.. టెన్షన్‍
రాష్ట్రవ్యాప్తంగా కరోనాకేసులు పెరుగుతున్న వేళ.. మంత్రి కేటీఆర్‍ ఈ నెల 17న వరంగల్‍ టూర్‍ రానున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ప్రకటించారు. భద్రకాళి బండ్‍ ఓపెనింగ్‍తో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే మరో ఏడెనిమిది అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎదురుపడితేనే భయంతో పక్కకు జరుగుతున్న టైంలో కేటీఆర్‍ టూర్‍కు ఎంతమంది వస్తారో, ఎందరికి కరోనా అంటిస్తారో అని సిటీ జనం భయపడుతున్నారు. కేటీఆర్ వస్తున్నారు గనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పదుల సంఖ్యలో కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు క్యూ కట్టే చాన్స్ఉంది. భద్రకాళి బండ్‍ ఓపెన్‍ చేసినా ఇప్పటికిప్పుడు ఆహ్లాదం
కోసం అక్కడికి జనాలు అంతగా వెళ్లే చాన్స్ లేదు. మిగతావన్నీ ఫ్యూచర్‍ డెవలప్‍మెంట్‍ పనుల శిలాఫలకాలే. ఈ క్రమంలో బాధ్యత కలిగిన మంత్రిగా కేటీఆర్‍ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

For More News..

మొదట 19 లక్షల కరెంట్ బిల్లు.. లొల్లి చేస్తే రూ.1,000కి ఎలా తగ్గింది

డ్యూటీకి రాకపోతే ఫైన్!