నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలి : వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలి : వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

బషీర్​బాగ్, వెలుగు: నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం హైదరాబాద్​లోని హిమాయత్ నగర్ వై జంక్షన్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులు  టి.నాగరాజు, ఎస్.రజనీకాంత్ (ఎస్ఎఫ్ఐ), పుట్ట లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్), పొడపంగి నాగరాజు, పి.మహేశ్, ఎస్.అనిల్, గణేశ్ (పీడీఎస్​యూ), నితిశ్(ఏఐడీఎస్ వో), పల్లె మురళి(ఏఐఎఫ్​డీఎస్) మాట్లాడారు.

ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో 12 ఏండ్లుగా ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు అప్పగిస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 93 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, పేదలకు విద్యను అందకుండా చేస్తోందన్నారు. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్–2025 బిల్లు యూనివర్సిటీలను దెబ్బతీసి, ఉన్నత విద్యకు పేద వర్గాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకంలో మార్పులు తెచ్చి గ్రామీణ పేదలకు కనీస పని గ్యారంటీ లేకుండా చేశారన్నారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్​కోడ్​లుగా మార్చి, కనీస వేతన చట్టాలు అమలు చేయకుండా కార్పొరేట్ కంపనీలకు లాభం చేకూర్చాలని చేస్తోందని విమర్శించారు.

టీఎన్జీవోల నిరసన

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా టీఎన్జీవోల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్‌‌‌‌ఫౌండ్రీ లోని డీఈవో ఆఫీస్​ఎదుట గురువారం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ నేతృత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలు, నాలుగు లేబర్ కోడ్​విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌‌‌‌ పీఆర్సీ అమలు, డీఏలను విడుదల చేసి, బిల్లుల మంజూరు, పాత పెన్షన్ విధానం అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.