ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే దాడులు.. పౌర హక్కుల సంఘాల నేతల ఆరోపణ

ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే దాడులు.. పౌర హక్కుల సంఘాల నేతల ఆరోపణ
  • ఎన్నికలప్పుడే ప్రజా సంఘాల నేతలపై అక్రమ కేసులు
  • మోదీ , కేసీఆర్, జగన్ ప్రమేయంతోనే ఎన్ఐఏ దాడులు

బషీర్ బాగ్, వెలుగు :   ప్రజా సంఘాల ప్రాథమిక హక్కులకు ఎన్ఐఏ భంగం కలిగిస్తుందని ఆ సంఘాల నేతలు మండిపడ్డారు. కవులు, రచయితలు, ప్రజా సంఘాల నేతలపై దాడులు చేస్తుందని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారని, ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదని, ఎన్నికల ముందే గుర్తొచ్చిందా.. అని ప్రశ్నించారు. ఊపా చట్టం పేరుతో హింసిస్తున్నారని, ఆ చట్టాన్ని తొలగించాలని పోరాటం చేస్తుంటే.. దాన్ని వాడుకుని ఎన్ఐఏ అక్రమ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.

 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడుల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హైదర్ గూడలో  పౌరహక్కులు, అమరుల బంధుమిత్రులు, విప్లవ రచయితల సంఘాల నేతలు సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావు మాట్లాడుతూ..  ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ఉండగానే ఎన్ఐఏ దాడులు చేస్తుందని,  ఇది షో చేయడానికేనని విమర్శించారు.

 ఎన్నికలు దగ్గర పడుతుండగా అవినీతి నేతల బాగోతం ప్రజా సంఘాలు బయటపెడతాయనే భయంతో దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ దాడులతో ప్రధాని మోదీ, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌‌‌‌‌‌‌‌కు సంబంధం ఉందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎక్కడికక్కడ ప్రజా సంఘాలను భయపెట్టి  ఓట్లతో బ్యాలెట్ బాక్సులు నింపుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిషేధిత వస్తువులు, పుస్తకాలను ఎన్ఐఏనే తీసుకొచ్చి, ఇంట్లో పెట్టి ఫొటోలు, వీడియోలు తీసి అక్రమ కేసులు పెడుతున్నారని వారు ఆరోపించారు.