
- కేబినెట్ బెర్త్ కోసం కొందరు నేతల ప్రయత్నాలు
- పలువురికి ఇతర పదవులపై హామీ
- మరికొందరికి తప్పని నిరీక్షణ
హైదరాబాద్, వెలుగు: మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న నేతలు నిరాశలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేయడంతో ఇప్పట్లో తమకు అవకాశం రానట్టేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులకు పదవులివ్వడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు. అయితే వీరిలో కొందరికి ఇతర పదవులపై హామీ లభించగా, మరికొందరికి అలాంటి హామీ కూడా దక్కలేదని సమాచారం. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రెడ్యానాయక్, ఆరూరి రమేశ్, టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య తదితరులు మంత్రి పదవులు ఆశించారు. ఇందులో ఇద్దరికి తప్పనిసరిగా చాన్స్ వస్తుందంటూ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ చివరికి అవకాశం రాలేదు.
మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఇటీవలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. రెడ్యా కుమార్తె, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కూడా కేటీఆర్ ను కలిశారు. అయితే కేబినెట్లో రెడ్యా నాయక్‌కు కాకుండా గతంలో ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న సత్యవతి రాథోడ్‌కు కేబినెట్ చాన్స్ వచ్చింది. కవితకు ఎంపీ టికెట్ ఇచ్చే సమయంలోనే రెడ్యాకు మంత్రి పదవి ఇవ్వబోమనే సంకేతాలున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
జోగు రామన్న మున్నూరుకాపు కోటాలో మంత్రి పదవి ఆశించారు. కేసీఆర్ తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన తనకు ఈసారి కచ్చితంగా అవకాశం దక్కుతుందని ఆశించారు. సెక్రటేరియెట్ డీ-బ్లాక్‌లోని తన పాత చాంబర్ ను ఎవరికీ కేటాయించకపోవడంతో.. తర్వాతి విస్తరణలో చాన్స్ ఇస్తారని లెక్కలు వేసుకున్నారు. కానీ అదే కులానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు అవకాశం దక్కడంతో.. రామన్న నిరాశలో మునిగిపోయారు.
పద్మా దేవేందర్‌రెడ్డి మహిళా కోటాలో మంత్రి పదవి ఆశించారు. తనకు అవకాశం ఇవ్వాలంటూ చాలాసార్లు సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో.. తనకు చాన్స్ వస్తుందని ఆశించారు. కానీ మహిళా కోటాలో సబితా ఇంద్రారెడ్డికి అవకాశం వచ్చింది. అయితే కేబినెట్ విస్తరణకు ముందే మరో కీలక పదవి ఇస్తామని సీఎం ప్రకటించడం పద్మా దేవేందర్‌రెడ్డికి ఊరట కలిగించింది.
కేసీఆర్ తొలి కేబినెట్‌లో పనిచేసిన లక్ష్మారెడ్డికి తిరిగి చాన్సిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. ఆయనకు తిరిగి వైద్యారోగ్య శాఖ ఇస్తారన్న చర్చ సాగింది. సీఎం కేసీఆర్ కూడా గతంలో ఆయనకు కేబినెట్ బెర్త్‌పై హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇప్పటికే నిరంజన్‌రెడ్డి కేబినెట్లో ఉండటం, కులం లెక్కలతో లక్ష్మారెడ్డికి అవకాశం దక్కలేదని అంటున్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఎస్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందని అప్పట్లోనే ప్రచారం జరిగింది. లేకుంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు లీకులిచ్చాయి. తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆమె పలుసార్లు కేటీఆర్‌ను కోరారు. తాజా విస్తరణలోనూ చోటు కోసం ప్రయత్నించారు. ఆమెను కాదని సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇవ్వడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎస్సీ కోటాలో కేబినెట్ బెర్త్ ఆశించారు. అప్పట్లో ఖమ్మం కోటాలో సండ్రకు పదవి గ్యారంటీ అని ప్రచారం జరిగింది. కానీ వారిద్దరిలో ఎవరికీ చోటు కల్పించలేదు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎప్పటికైనా తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కమ్మ కులానికే చెందిన పువ్వాడ అజయ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడంతో తుమ్మలకు ఇక ముందు చాన్స్ రాకపోవచ్చని అంటున్నారు.
ఎమ్మెల్సీలైన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు కూడా కేబినెట్ బెర్త్ ఆశించారు. కడియం శ్రీహరి, నాయినికి ఇతర కీలక పదవులు ఇస్తామని సీఎం ప్రకటించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్ పదవిని ఖరారు చేసినట్టు సమాచారం.