కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరం..‘దేశం కోసం’ పుస్తకావిష్కరణ సభలో వామపక్ష నేతలు

కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరం..‘దేశం కోసం’ పుస్తకావిష్కరణ సభలో వామపక్ష నేతలు

ముషీరాబాద్, వెలుగు: దేశంలో పెరుగుతున్న ఫాసిస్టు, మతోన్మాద ధోరణులను ఎదుర్కోవాలంటే కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరమని పలువురు వామపక్ష నేతలు అన్నారు. ఆదివారం హైదరాబాద్​లోని బాగ్‌‌‌‌‌‌‌‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యవేదిక(యూఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్) ఆధ్వర్యంలో జస్టిస్ బి.చంద్రకుమార్ రచించిన దేశం కోసం వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి అనే పుస్తకాన్ని సినీ నటుడు మాదాల రవి ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. చీలికల వల్ల కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిందని, అంబేద్కరిస్టులు, సామాజిక ఉద్యమ శక్తులను కలుపుకొని విశాల ప్రత్యామ్నాయ వేదికను నిర్మించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కందిమల్ల ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వివిధ వామపక్ష పార్టీల నేతలు గాదగోని రవి, కె.రమ, కె.గోవర్దన్, జానకి రాములు, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.