ఆస్పత్రిలోకి చిరుతపులి.. భయంతో రోగులు పరుగులు

ఆస్పత్రిలోకి చిరుతపులి.. భయంతో రోగులు పరుగులు

మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో డిసెంబర్ 12న ఒక చిరుతపులి ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి, రోగులను భయపెట్టింది. మంగళవారం ఉదయం షహదా ప్రాంతంలోని ఆదిత్య ప్రసూతి, కంటి ఆసుపత్రికి ఒక కార్మికుడు వచ్చి కేకలు వేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రిలో చిరుతపులి ఓ మూలన కూర్చున్నట్లు ఉద్యోగి గుర్తించాడు. అనంతరం అతను ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించాడు. వారు వెంటనే పులి వెనుక ఉన్న తలుపును చాకచక్యంగా మూసివేశారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకున్నారు. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే చిరుతపులి ఆసుపత్రికి రావడంతో రోగులు భయాందోళనలకు గురయ్యారు. బోనులో చిక్కుకున్న జంతువును చూసేందుకు రోగుల బంధువులతో సహా చాలా మంది ప్రజలు ఆసుపత్రి వెలుపల గుమిగూడారు.

ఈ నెల ప్రారంభంలో, ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్ ప్రాంతంలోనూ ఓ చిరుతపులి కనిపించింది. దీంతో అటవీ శాఖ, పోలీసులు, వన్యప్రాణి బృందాలతో కూడిన భారీ శోధన ఆపరేషన్ ప్రారంభించారు. పిల్లి జాతికి సంబంధించిన రెండు వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో కనిపించాయి. అందులో జంతువు ఒక ఫామ్‌హౌస్ దగ్గర తిరుగుతూ కనిపించింది. ఒక వీడియోలో, చిరుతపులి గోడపై నుండి దూకి అడవిలోకి పరిగెత్తడానికి ముందు ఒక పోలీసు పరిగెత్తడం కనిపిస్తోంది.