లోహపు బిందెలో ఇరుక్కున్న చిరుతపులి తల..ఐదు గంటలు శ్రమించి రక్షించారు

లోహపు బిందెలో ఇరుక్కున్న చిరుతపులి తల..ఐదు గంటలు శ్రమించి రక్షించారు

ఎలా పెట్టిందో.. ఎందుకు పెట్టిందో గానీ.. ఓ ఇంట్లో చొరబడి లోహపు బిందెలో తల పెట్టింది ఓ చిరుత పులి.. ఇక చూడు..దాని పరిస్థితి.. ఏమీ కనిపించక.. ఎటు పోవాలో తెలియక.. ఆ గోడకు ఈ గోడుకు గుద్దుకుంటూ దాదాపు ఐదు గంటల పాటు హల్ చల్ చేసింది. చిరుతను చూసిన ఇంట్లోవాళ్లు, చుట్టు పక్కల జనం భయంతో వణికిపోయారు. కాసేపటికి తేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్రలో జరిగిన ఈ చిరుత పులి ఘటనకు సంబంధించిన కథేంటో తెలుసుకుందాం రండి.. 

మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని ఓ కుగ్రామంలో తాగునీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించే లోహపుపాత్రలో చిరుతపులి తలను దూర్చిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరుత పులి లోహపు  బిందెలో తలదూర్చినట్లు వీడియోలో కనిపిస్తుంది. నీళ్లు తాగడానికి పోయిందా.. లేక అనుకోకుండా తల బిందెలో ఇరుక్కుపోయిందా తెలియదు గానీ.. ఎటు పోవాలో.. ఎలా పోవాలో తెలియక.. దారి కనిపించక.. ఆ గోడకు ఈ గోడకు కొట్టుకుంటూ నరకం చూసి.. చివరికి అలసిపోయి పడిపోయింది.  

చిరుతను చూసి ఆ ఇంట్లోవాళ్లు, చుట్టు పక్కల వాళ్లు మొదట భయాందోళనకు గురయ్యారు. తర్వాత తేరుకొని అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.. అక్కడి చేరుకున్న అటవీశాఖ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు చిరుతకు మత్తు మందు ఇచ్చారు. ఐదు గంటల పాటు శ్రమించి లోహపు బిందెను కట్ చేశారు. తర్వాత అటవీశాఖా అధికారులు..చిరుతను బంధించి తీసుకెళ్లడంతో కథ సుఖాంతం అయింది.