రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుదాం: కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుదాం: కేసీఆర్
  • కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అనాలోచిత చర్య
  • రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుదాం: కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనాలోచిత చర్య అని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం రాత్రి నంది నగర్ లోని తన నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు కృష్ణా బేసిన్ లోని నాయకులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.

కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయం దక్షిణ తెలంగాణ రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలి పెట్టులా మారిందన్నారు. సాగర్, శ్రీశైలం సహా ఇతర ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర హక్కులను కాలరాసిందన్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, రాష్ట్రానికి కలిగే నష్టాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశం లో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ తదితరులుపాల్గొన్నారు.