
బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: అధికార బీఆర్ఎస్ అహంకార, అవినీతి, అక్రమ పాలనకు చరమగీతం పాడేందుకు నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలు చర్చించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని, బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలను ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రజలకు నిజాలు చెబుతూ.. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడుదామంటూ సూచించారు. బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీని ఓడించగలదనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.