దోషులను వదిలిపెట్టం: మోదీ

దోషులను వదిలిపెట్టం: మోదీ

ఇంఫాల్: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది దేశం మొత్తం సిగ్గుపడేలా చేసిందని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పారు. గురువారం వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ కాంప్లెక్స్ లో మోదీ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ ఆడబిడ్డలకు జరిగిన దారుణం ఎన్నటికీ క్షమించలేనిదని ఆయన అన్నారు. ‘‘ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసింది. నా హృదయం కోపం, బాధతో బరువెక్కింది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని దేశ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. చట్టం పూర్తి శక్తితో పని చేస్తుంది” అని చెప్పారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ దిశగా అన్ని రాష్ట్రాలు చట్టాలను కఠినం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలను ప్రస్తావించారు. ‘‘మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి. మహిళలను గౌరవించాలి. వాళ్లపై జరుగుతున్న నేరాలపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి” అని సూచించారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.