నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తిరస్కరిద్దాం

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తిరస్కరిద్దాం

ఓయూ,వెలుగు:  రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం–-2020లో అనేక లోపాలు ఉన్నాయని, లోపభూయిష్టమైన విద్యా విధానాన్ని ప్రజలందరూ తిరస్కరించాలని ఓయూ ప్రొఫెసర్ ​కాసీం, ఏఐఎస్ఎఫ్​కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పిలుపునిచ్చారు. విద్యా కాషాయీకరణ, ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానం ఉందని ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్​రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే కేంద్రం నూతన జాతీయ విద్యావిధానం- తీసుకొచ్చిందని విమర్శించారు. 90శాతం  విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేస్తూ, రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉందని మండిపడ్డారు. ఏఐఎస్​ఎఫ్​నేతలు మణికంఠ రెడ్డి, గ్యార నరేష్, గ్యార క్రాంతి, నెల్లి సత్య, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.