విద్యుత్ సంక్షోభం.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

విద్యుత్  సంక్షోభం.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

దేశంలో విద్యుత్ పై రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ ను వాడుకోవాలని తెలిపింది. మిగులు కరెంట్ ఉన్న రాష్ట్రాలు, కొరత ఉన్న రాష్ట్రాలకు సహాయం చేయాలని కోరింది. కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయకుండా లోడ్ సర్దుబాటు కోసం కోతలు విధిస్తున్నాయని, ఇదే సమయంలో అధిక ధరలకు విద్యుత్ అమ్ముకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదేనంటూ రాష్ట్రాలకు లేఖ రాసింది. 

విద్యుత్ కేటాయింపుల గైడ్ లైన్స్ ప్రకారం మొత్తం ఉత్పత్తిలో 15 శాతం కరెంట్ ను ఏ రాష్ట్రాలకు కేటాయించకుండా సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల దగ్గర ఉంటుందని కేంద్రం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ అవసరమున్న రాష్ట్రాలకు దీన్ని కేటాయిస్తామని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ్వరికీ కేటాయించని విద్యుతును  రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు తమకు తెలపాలని కోరింది. మిగులు విద్యుత్ ను కరెంట్ అవసరమున్న రాష్ట్రాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. ముందుగా వినియోగదారులకే కరెంట్ అందించకుండా,  ఎక్కువ రేట్లకు అమ్ముకునే రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.