నాకు కరోనా లేదు.. సెల్ఫ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నా

నాకు కరోనా లేదు.. సెల్ఫ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నా

లండన్: కరోనా పాజిటివ్‌‌ వచ్చిన వ్యక్తులతో కలిసి తిరిగినప్పట్నించి తాను సెల్ఫ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉంటున్నానని బ్రిటన్‌‌ ఫార్ములావన్‌‌ డ్రైవర్‌‌ లూయిస్‌‌ హామిల్టన్‌‌ అన్నాడు. అయితే తనకు వైరస్‌‌ సోకలేదని స్పష్టం చేశాడు. చాలా లిమిటెడ్‌‌గా ఉండే కరోనా టెస్ట్‌‌ కిట్స్‌‌ను తనకంటే ఇతరులకు ఉపయోగించడం ముఖ్యమన్నాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌‌ప్రి రద్దుకావడంతో.. ఈనెల 4న లండన్‌‌లో జరిగిన ఓ చారిటీ ఈవెంట్‌‌లో హామిల్టన్‌‌ పాల్గొన్నాడు. ఇదే కార్యక్రమానికి నటి ఇద్రిస్‌‌ ఎల్బా, కెనడా ప్రైమ్​ మినిస్టర్‌‌ భార్య సోఫియా జార్జేర్‌‌ కూడా హాజరయ్యారు. తర్వాత జరిపిన పరీక్షల్లో ఆ ఇద్దరికీ కరోనా పాజిటివ్‌‌ అని తేలింది. ఇది తెలిసిన వెంటనే హామిల్టన్‌‌ సెల్ఫ్‌‌ ఐసోలేషన్‌‌కు వెళ్లిపోయాడు. ‘ఇప్పుడైతే నేను బాగానే ఉన్నా. నా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లలో నిజం లేదు. నాలో కరోనా లక్షణాలు లేవు. 17 రోజులుగా ఐసోలేషన్‌‌లో ఉన్నా. ఇద్రిస్‌‌, సోఫియా కూడా బాగానే ఉన్నారు. వాళ్లతోనూ టచ్‌‌లో ఉన్నా. టెస్ట్‌‌ చేయించుకోవడం గురించి మా డాక్టర్‌‌తో మాట్లాడా. అవసరం లేదని చెప్పారు. లిమిట్‌‌గా ఉండే కరోనా కిట్స్‌‌.. నా కంటే అవసరమైన వాళ్లకు ఉపయోగపడితే బాగుంటుంది’ అని హామిల్టన్‌‌ వ్యాఖ్యానించాడు.