రెండు డెయిరీ సంస్థల  లైసెన్సులు సస్పెండ్..హైదరాబాద్ సిటీ, శివారులో 20 డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్‌‌‌‌ తనిఖీలు

రెండు డెయిరీ సంస్థల  లైసెన్సులు సస్పెండ్..హైదరాబాద్ సిటీ, శివారులో 20 డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్‌‌‌‌ తనిఖీలు
  • లైసెన్స్‌‌‌‌ లేని ఒక సంస్థ మూసివేత.. 13 డెయిరీలకు నోటీసులు
  • కల్తీ అనుమానంతో 18 పాల శాంపిళ్ల సేకరణ

హైదరాబాద్, వెలుగు: రూల్స్‌‌‌‌ పాటించని రెండు డెయిరీ సంస్థల లైసెన్సులను తెలంగాణ ఫుడ్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎసెన్షియల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ అథారిటీ (టీజీ సేఫ్‌‌‌‌) సస్పెండ్‌‌‌‌ చేసింది. హైదరాబాద్‌‌‌‌ కోర్‌‌‌‌ అర్బన్‌‌‌‌ పరిధితో పాటు శివారు జిల్లాల్లోని పాల ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్లలో ఫుడ్‌‌‌‌ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన పది టీములు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో కర్మన్‌‌‌‌ఘాట్‌‌‌‌ సాగర్‌‌‌‌ రోడ్డులోని సప్తగిరి ఫుడ్స్‌‌‌‌లో నేలపై పాచి పట్టడం, డ్రైనేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం, ఈగలు, చెత్త పేరుకుపోవడంతో పాటు నీరు, పాల పరీక్షల రికార్డులు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆ సంస్థ లైసెన్స్‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌ చేశారు. అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌‌‌ మండలం పసుమాములలోని ఆల్‌‌‌‌ రిచ్‌‌‌‌ డెయిరీలో బొద్దింకలు, ఈగల సంచారం, నేలపై నీరు నిలవడం, పైకప్పు పెచ్చులు ఊడటం గుర్తించారు.

కోల్డ్‌‌‌‌ రూమ్‌‌‌‌లోనే పాన్‌‌‌‌ మసాలా ఉమ్మిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. దీంతో ఆ యూనిట్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ను సైతం రద్దు చేసి కార్యకలాపాలు నిలిపివేయించారు. మరోవైపు హయత్‌‌‌‌నగర్‌‌‌‌లోని వెంకట శివ మిల్క్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను ఎలాంటి ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ లైసెన్స్‌‌‌‌ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నడుపుతుండటంతో ఆ కేంద్రాన్ని పూర్తిగా మూసివేయించారు.

13 సంస్థలకు నోటీసులు.. 

తనిఖీల్లో మొత్తం 20 యూనిట్లను పరిశీలించిన అధికారులు.. కల్తీ అనుమానం ఉన్న వివిధ కేంద్రాల నుంచి 18 పాల నమూనాలను సేకరించి ల్యాబ్‌‌‌‌ పరీక్షలకు పంపించారు. నిబంధనల ఉల్లంఘనకు జరిమానా విధించేందుకు జిల్లేలగూడలోని సరిత డెయిరీ, బాలాపూర్‌‌‌‌ అల్మాస్‌‌‌‌గూడలోని శ్రీ సాయి డెయిరీ, నందిగామలోని మిల్కీ ప్లస్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ (గాయత్రి డెయిరీ) యూనిట్లకు షోకాజ్‌‌‌‌ నోటీసులు జారీ చేశారు.

యంత్రాలు, పైపులు తుప్పుపట్టడం, బూజు పేరుకుపోవడం, కార్మికుల ఆరోగ్య రికార్డులు లేకపోవడం వంటి లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశిస్తూ ఇంజాపూర్‌‌‌‌ ఫెడరేటెడ్‌‌‌‌ వైట్‌‌‌‌ నెక్టార్‌‌‌‌, పాల్మాకోల్‌‌‌‌ శాంతి ఫామ్‌‌‌‌, బైరమల్‌‌‌‌గూడ డెయిరీ స్పాట్‌‌‌‌, కర్మన్‌‌‌‌ఘాట్‌‌‌‌ శ్రీ లక్ష్మీ నరసింహ మిల్క్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌, కడ్తాల్‌‌‌‌ హట్సన్‌‌‌‌ డెయిరీ, బాటసింగారం అర్వైస్‌‌‌‌ నేచర్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌, గూడూర్‌‌‌‌ నేచర్‌‌‌‌ ఫామ్‌‌‌‌, ముచ్చింతల్‌‌‌‌ వి.కె. డెయిరీ, నాదర్‌‌‌‌గుల్‌‌‌‌ శ్రీ గీత మిల్క్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌, షాబాద్‌‌‌‌ సిడ్స్‌‌‌‌ ఫామ్‌‌‌‌ సహా పది సంస్థలకు ఇంప్రూవ్‌‌‌‌మెంట్‌‌‌‌ నోటీసులు ఇచ్చారు. వీటిని త్వరలోనే పునఃపరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ డ్రైవ్‌‌‌‌లో భాగంగా ఉప్పల్‌‌‌‌లోని క్రీమ్‌‌‌‌ లైన్‌‌‌‌ (జెర్సీ), హెరిటేజ్‌‌‌‌ డెయిరీలు, సంగారెడ్డిలోని బీజాపూరి డెయిరీ (కంట్రీ డిలైట్‌‌‌‌), పెద్దషాపూర్‌‌‌‌లోని కంట్రీసైడ్‌‌‌‌ ఫామ్స్‌‌‌‌లో కూడా తనిఖీలు చేపట్టారు.