- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ/మేళ్లచెరువు(చింతలపాలెం)/పాలక వీడు, వెలుగు: ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
బుధవారం ఆయన సూర్యాపేట జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకం పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో రూ.47.64 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన మంత్రి, ఆగస్టు నాటికి పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద రూ.1,648 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఎంబీసీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సమీక్షించారు. ఈ పథకం ద్వారా 23 గ్రామాల్లోని 53 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇందుకోసం 16 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 4 బాహుబలి పంపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
పాలకవీడు మండలం గుండెబోయిన గూడెం పరిధిలోని జవహర్ జాన్పాడు ఎత్తిపోతల పథకం పనులను కూడా పరిశీలించి, జూలై చివరి నాటికి పనులు పూర్తి చేసి 15 గ్రామాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
