2 గంటలు లైట్లు బంజేయండి

2 గంటలు లైట్లు బంజేయండి
  • దేశంలో భారీగా తగ్గిన బొగ్గు ఉత్పత్తి 
  • విద్యుత్ సంక్షోభం అంచున ఆస్ట్రేలియా   

మెల్ బోర్న్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పెద్ద ఎత్తున బొగ్గును ఎగుమతి చేసే ఆస్ట్రేలియా విద్యుత్ సంక్షోభం అంచుకు చేరింది. దేశంలో విద్యుత్ సంక్షోభం పెరుగుతుండటంతో వీలైతే రాత్రిపూట రెండు గంటల పాటు లైట్లు ఆర్పేయాలంటూ స్వయంగా ఆ దేశ ఇంధన శాఖ మంత్రి క్రిస్ బోవెన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజలు తప్పనిసరిగా సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య అవసరం లేని అన్ని ఎలక్ట్రిక్ వస్తువుల వాడకాన్ని ఆపేయాలని కోరారు. సిడ్నీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ప్రజలు విద్యుత్ పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. బొగ్గు కొరత వల్ల గురువారం రాత్రి 5 నుంచి 10.30 మధ్య క్వీన్స్ లాండ్ రాష్ట్రానికి పవర్ కట్ అయ్యే అవకాశం ఉందని ఆస్ట్రేలియన్ ఎనర్జీ మార్కెట్ ఆపరేటర్ (ఏఈఎంవో) హెచ్చరించింది. ఆస్ట్రేలియాలో విద్యుత్ సంక్షోభంపై గురువారం ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహించారు.  

బొగ్గు ఉత్పత్తి తగ్గడం వల్లే.. 

ఆస్ట్రేలియాలో క్వీన్స్ లాండ్, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాల్లోనే బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఈ రెండు రాష్ట్రాల్లో భారీగా వరదలు సంభవించాయి. దీంతో బొగ్గు గనులు నీట మునిగాయి. బొగ్గు సరఫరా చేసే రైల్వే లైన్లు బాగా దెబ్బతిన్నాయి. దీంతో క్రమంగా దేశవ్యాప్తంగా బొగ్గు సప్లై చైన్ కు ఆటంకం కలుగుతోంది. మరోవైపు కరోనా ఆంక్షలు ఎత్తేసిన తర్వాత కరెంట్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒకవైపు బొగ్గు ఉత్పత్తి తగ్గడం, మరోవైపు డిమాండ్ తో పాటు ధరలు విపరీతంగా పెరగడంతో పరిస్థితి విద్యుత్ సంక్షోభానికి దారితీసింది. బొగ్గు, ఎల్ఎన్ జీ ఎగుమతి చేసే దేశాల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. అయితే, ఆ దేశంలో దాదాపు 65 శాతం కరెంట్ బొగ్గుతోనే ఉత్పత్తి అవుతుండటంతో బొగ్గు సప్లై తగ్గి సంక్షోభం ఏర్పడింది. 

ఇండియాపైనా ఎఫెక్ట్

ఆస్ట్రేలియాలో విద్యుత్ సంక్షోభం ఎఫెక్ట్ మనపైనా పడే అవకాశం ఉంది. మనదేశంలోని పలు థర్మల్ పవర్ ప్లాంట్లకు ఆస్ట్రేలియా, రష్యా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల నుంచే బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతికి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉండటంతో, మనదేశంలోని పలు పవర్ ప్లాంట్లకు కూడా బొగ్గు సరఫరా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.