
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలకు అందజేయాలంటే మన చరిత్రను, మన సంస్కృతిని నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉందని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు. బుధవారం ఆయన ఉన్నత విద్యామండలిలో ఓయూ వీసీ రవీందర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తో కలిసి ‘తెలంగాణ చరిత్ర’ బుక్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ..పుస్తకాన్ని రాసిన చరిత్రకారులు అడపా సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణను ప్రశంసించారు. ‘తెలంగాణ చరిత్ర’ బుక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారితో పాటు ఇంటర్, యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాచీన, మధ్యయుగ కాలాల నుంచి నేటి ప్రజాస్వామ్య పాలకుల దాకా వేలాది సంవత్సరాల చరిత్రను ఈ పుస్తకం ద్వారా అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, పబ్లిషర్ కోయ చంద్రమోహన్, ఇంజినీర్ల జేఏసీ తన్నీరు వెంకటేశం, రచయితలు పాల్గొన్నారు.