ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్
  • ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డకు హైకోర్టులో ఎదురుదెబ్బ
  • ఏకగ్రీవాలు అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఆదేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కు లైన్ క్లియర్ అయింది. గత ఏడాది కరోనాకు ముందు నోటిఫికేషన్ జారీ చేశాక బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని, దౌర్జన్యంగా ఉపసంహరింపచేశారని, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారన్న ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషననర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు గెలిచినట్లుగా డిక్లరేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలపై దర్యాప్తు చేసే అధికారం ఎన్నికల కమిషనర్ కు లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే  ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు ఇలా ఉంటే ఈనెల 19వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యక్తిగత సెలవుపై వెళ్లాలని యోచిస్తున్నారు. మరి కోర్టు తీర్పు భిన్నంగా రావడంతో ఎలా స్పందిస్తారో.. ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల షెడ్యూల్ వెంటనే ప్రకటిస్తారా.. లేక గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు చేస్తారు.. ? అన్నది ఆసక్తికరంగా మారింది.