కొనసాగుతున్న పెద్దగట్టు జాతర..వైభవంగా లింగమంతుల స్వామి లగ్గం

కొనసాగుతున్న పెద్దగట్టు జాతర..వైభవంగా  లింగమంతుల స్వామి లగ్గం

సూర్యాపేట, వెలుగు: పెద్దగట్టు జాతరలో ప్రధాన ఘట్టమైన స్వామి వారి లగ్గం మంగళవారం ముగిసింది. బైకాని వారు చంద్రపట్నం వేసి.. లింగమంతుల స్వామి, మాణిక్యమ్మల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం, చంద్రపట్నాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. ముందుగా పెద్దగట్టు హక్కుదారులైన మెంతనబోయిన, మున్న, గొర్ల(రెడ్డి) వంశీయులు తెచ్చిన పూజా సామగ్రి, తెల్లపిండి, పచ్చపిండి, కుంకుమలతో దేవతామూర్తుల చిత్రాలను అచ్చుగా వేశారు. ఆ తర్వాత లింగమంతుల స్వామి విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను చంద్రపట్నంపై ఉంచి పూజలు చేశారు. మెంతనబోయిన, మున్న, గొర్ల వంశాలకు చెందిన పెద్దలకు బైకాన్లు కంకణం కట్టి, బొట్టు అప్పగించారు. మెంతనబోయిన వారు కటార్లు, మున్న, గొర్ల వంశీయులు స్వామి వారి కల్యాణ తంతు నిర్వహించారు. అనంతరం మెంతనబోయిన వంశీయులు పూజలు చేసి కేసారం గ్రామానికి పయనమయ్యారు. చంద్రపట్నం చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ఇయ్యాల జాతరలో నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రత్యేక పూజలు చేసిన మంత్రి..

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. చంద్రపట్నం, కల్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇప్పటివరకు 12లక్షలకు పైగా భక్తులు వచ్చారని, మరో రెండు రోజులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా భక్తులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.