మందును ముందే.. కొనిపెట్టుకుని పంచిపెట్టిన్రు

మందును ముందే..  కొనిపెట్టుకుని పంచిపెట్టిన్రు
  • రాష్ట్రంలో మూడు నెలల్లో రూ.8,900 కోట్ల లిక్కర్​ సేల్స్​

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల వేళ రాష్ట్రంలో మూడు నెలల్లో దాదాపు రూ.8,900  కోట్ల విలువైన లిక్కర్​ అమ్ముడుపోయింది. అక్టోబర్​ 9న ఎలక్షన్​ షెడ్యూల్​ రిలీజ్​ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందులో సగం సేల్​ అయినట్లు ఎక్సైజ్​ శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్​ వస్తే మద్యం అమ్మకాలపై కంట్రోల్​ ఉంటుందని ముందే గ్రహించిన ప్రభుత్వం, ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ అంతకంటే ముందు నెల నుంచే లిక్కర్​ సేల్స్​ను అమాంతం పెంచింది.

ముందస్తు స్టాక్​లను రిలీజ్​ చేసింది. దీంతో ఆ సమయంలోనే భారీగా లిక్కర్​ను వైన్​షాప్స్​, బార్​ల యజమానులు డంప్​ చేసుకున్నారు. ఆ మొత్తం ఎన్నికల క్యాంపెయిన్​లో పంచేశారు.  ప్రచారంలో పాల్గొన్న జనాలు, కార్యకర్తలకే కాకుండా.. బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకువెళ్లిన ప్రజలకు కూడా లిక్కర్​ బాటిళ్లను ఇచ్చారు. బల్క్​గా తరలిస్తున్న మద్యాన్ని చాలాచోట్ల పోలీసులు, ఇతర ఎన్నికల అధికారులు సీజ్​ చేశారు. వీటి విలువ రూ.127 కోట్లు ఉండగా.. ఇందులో 2.63 లక్షల లీటర్ల లిక్కర్​, బ్లాక్​ జాగెరి వంటివి ఉన్నాయి. అయితే.. లిక్కర్​ డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని చాలాచోట్ల అక్రమార్కులు నకిలీ మద్యం తయారు చేసి పొలిటికల్​ లీడర్లకు తక్కువ ధరకే అమ్మినట్లు తెలిసింది.

దసరా నుంచే పంపకాలు

ఎన్నికల షెడ్యల్​ కంటే ముందే రాష్ట్రంలో మద్యం పంపకాలు మొదలయ్యాయి. తెలంగాణలో పెద్ద పండుగ అయిన దసరాకు లీడర్లు లిక్కర్​ను పంపిణీ చేశారు. ఎన్నికల వేళ ఇబ్బంది కావొద్దని ముందే పంపిణీ చేసినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా వైన్​షాప్​ల నుంచి ముందే పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసుకుని.. గ్రామాల్లో డంప్​ చేసి పెట్టారు. ప్రచార సమయంలో ఇబ్బంది లేకుండా ఆ బాటిళ్లను పంపిణీ చేశారు. దీంతో ఒక్క సెప్టెంబర్​ నెలలోనే ఏకంగా రూ. 3,600 కోట్ల లిక్కర్​ అమ్ముడు పోయింది.

ఆ తర్వాత అక్టోబర్​ నెలలోనూ రూ.3,100 కోట్ల మద్యం సేల్​ అయినట్లు ఎక్సైజ్​ అధికారులు చెప్తున్నారు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి పెట్టుకున్న క్వార్టర్, హాఫ్ బాటిళ్లను లీడర్లు గ్రామాల్లో పంచారు. 2022 నవంబర్ మొదటి 20 రోజుల్లో లిక్కర్ సేల్స్ రూ.1,260 కోట్లు జరిగాయి. అప్పట్లో అంత మొత్తం అమ్ముడుపోవటమే చాలా పెద్ద విషయంగా ఎక్సైజ్ వర్గాలు చెప్పుకున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ నవంబర్​లో ఇప్పటికే రూ. 2,200 కోట్ల లిక్కర్​ సేల్​ అయింది.  అయితే గత రెండు నెలల్లో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిపెట్టుకోవడం, పైగా డిసెంబర్​ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ మొదలవుతుండటంతో స్టాక్​ ఖాళీ చేసేశారు.