చండీగఢ్: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించారు. ధులావత్ టోల్ ప్లాజా సమీపంలో కుండ్లి-మనేసర్-పల్వాల్ (KMP) ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం (మే 5) ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
మృతులను ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాకు పోలీస్ సిబ్బందిగా గుర్తించారు. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ధాటికి వాహనంలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని అధికారులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
