ఆధ్యాత్మికం :  గుళ్లు.. గోపురాలకు చందాలిస్తే పాపాలు పోతాయా? పురాణాల్లో ఏముందో తెలుసా..!

ఆధ్యాత్మికం :  గుళ్లు.. గోపురాలకు చందాలిస్తే పాపాలు పోతాయా? పురాణాల్లో ఏముందో తెలుసా..!

భారతీయ జీవన విధానం ఆధ్యాత్మికమైనది. మనం.. 'ఎక్కడి నుండి వచ్చాం? ఎక్కడికి వెళతాం? ఇక్కడ చేయవలసింది ఏంటి?' అనే ప్రశ్నల ఆధారంగా ఋషులు దర్శించిన సత్యం.. సాహిత్యంగా వెలుగు చూసింది. అయితే ఆ తత్త్వం సామాన్యులకు బోధపడేలా లేదు. పండితులకే కాకుండా. పామరులకు కూడా అర్థమయ్యేలా ప్రతీకాత్మకమైన గాథల రూపంలో మనకు ఆధ్యాత్మిక భావాలు బోధించారు. అయినప్పటికీ మనిషి వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుడు చెప్పని వాటిని చేస్తూ 'నేను దేవుడిని చేరుకుంటాన'ని కలలు కంటున్నాడు మనిషి. ఈ కలలు నిజమవుతాయా?

భారతీయ సాహిత్యంలో పురాణాలది  అగ్రస్థానం. అందుకే 'పునర్నవీనం పురాణం' అన్నారు. పురాణాలను కాలాన్నిబట్టి సవీనంగా నిర్వచించుకునేందుకు, అన్వయించుకునేందుకు అవకాశం ఉన్నది. 'ఏది కర్తవ్యమో, ఏది కర్తవ్యమో కానిదో నిర్ధారించి, కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రేరణ నిచ్చేవని పురాణాలను నిర్వచించారు. వీటి మూలం మానవ జీవనమే. మానవ జీవనంలోని అన్ని పార్శ్వాలనూ పురాణాలు వర్ణించాయి.

పురాణాలు ఏమని చెప్పాయి?

ఏ పేరుతో పిలిచినా, ఈ సృష్టి ఆవిర్భావానికి ముందు ఉన్నది ఒకే ఒక్క శక్తి. దానిని మతాలు దేవుడు అన్నాయి. తాత్వికులు ఆత్మ అన్నారు. భౌతిక వాదులు శక్తి అన్నారు. వెరసి అదే దైవాత్మశక్తి. ఆ క్రమంలో వెలువడిందే దైవం అనే భావన. మూల చైతన్యానికి ఎవరిపై ప్రేమ, ద్వేషం కానీ లేదు. సమభావనతో చేసిన కర్మలకు ఫలితాన్నిస్తుంది.. భజించాడని, పూజించాడని అనుగ్రహించడం... లేదని ఆగ్రహించడం మూల చైతన్య లక్షణం కాదు. అయితే ప్రజలను క్రమశిక్షణలో పెట్టేందుకు సామాజిక మార్గ దర్శకులు ఆ చైతన్యానికి మహిమలు కల్పించి సాధారణ ప్రజానీకాన్ని ఆ వైపు మళ్ళించే ప్రయత్నం చేసారు.

త్యాగం చేస్తేనే పుణ్యం

సశాస్త్రీయమైనవి దేవాలయాలు. యంత్రాలు పెడుతూ మంత్రపూతమైన విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యపూజాదికాలు నిర్వహించడం వల్ల ఆ మంత్రోచ్ఛారణచే కలిగిన శక్తి ప్రకంపనలు ఆ పరిసరాలను పవిత్రం చేస్తాయి. శక్తివంతం చేస్తాయి. అందుకే నిత్యం ఒకే అంతరంలో ఉచ్ఛరించబడే శబ్ద తరంగాలను ప్రసరింపచేయడం ఆచారంగా మారింది. ఆ ప్రక్రియలో భాగంగా అర్చనాదులను ఏర్పాటు చేసారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరిగేందుకు అవసరమైన యంత్రాంగం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఈ వ్యవస్థ అంతా పాలకుల చేతుల్లో ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజలే ఆ వ్యవస్థను నడపాల్సిన అగత్యం ఏర్పడింది.

జీవన్ముక్తికి మార్గం

పాపపుణ్యాలనేవి నిజానికి సాపేక్షమే. ఇతరులకు మంచి జరిగితే అది పుణ్యం  అంటాం. చెడు జరిగితే అది పాపం అంటాం. సత్కార్యాలు చేసినప్పుడు పాపం పోవడం ఉండదు. చెడు చేస్తే పాపము రావడమూ ఉండదు. చేసిన కర్మకు ఫలితం ఉంటుంది. దేనికదే రెండూ అనుభవించాల్సిందే. జ్ఞానం వల్ల సమభావన కలిగి సమదృష్టితో సకల జీవులను ఆదరించిన వారికి, తనకున్న దానిని పంచుకున్న వారికి సత్ఫలితాలు వస్తాయి. అన్నింటినీ కర్మ ఫలితంతో సహా త్యాగం చేయగలిగిన వారికి జీవస్ముక్తి లభిస్తుంది.

దైవ దర్శన సందర్భంలో కొందరు తలనీలాలు సమర్పిస్తారు. నిజానికి దేవుడికి మన తలనీలాలతో పని ఏమిటి? తల అహంకారానికి ప్రతీక. కాబట్టి ఆ అహంకారాన్ని భగవంతునికి సమర్పించి నిర్మలమైన భావనతో శేష జీవితం గడపమని ప్రతీకగా బోధిస్తున్నారు. 

దారుణాలు చేస్తూ తలనీలాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. మళ్ళీ మళ్ళీ చేసే పాపాలకు నిలయమైన మనసును ప్రక్షాళన చేయాలి. మన మనసే మన ఉన్నతికి, పతనానికి కారణమవుతోందనే విషయాన్ని గుర్తించాలి.. అహంకారాన్ని విడిచిపెట్టేందుకు తలనీలాలు సమర్పిస్తాం. మరి అహంకారాన్నే వదలకపోతే.... ఎన్నిసార్లు తలనీలాలు ఇస్తే ఏం లాభం?.

భగవంతునికి చేరువ చేసేవి

నిరాకారమైన భగవంతుడిని ఊహించలేం. కాబట్టి ఆ అఖండ, అనంతమూర్తికి ప్రతీకగా పరిమితమైన మూర్తిని ప్రతిష్ఠించుకుంటాం. దానిని అర్చించడం, పూజించడం వల్ల మనో మాలిన్యాలను కడిగేసుకొని, మనసును అనంత చైతన్యానికి అనుసంధానించుకుంటాం. ఏకాగ్రతతో ధ్యానావస్థలో పూజించడం వల్ల కలిగే శక్తి.. ప్రాకృతిక చైతన్యాన్ని ఆకర్షిస్తుంది. ఏకాగ్రత అనేకాగ్రతగా మారితే యాంత్రికమైన పూజాదులు ఇచ్చే ఫలితం పరిమితమే.

శీలం అంటే స్వభావం. మనం సమాజంతో ఎలా భావైక్యత చెందుతున్నామో నిర్ణయిస్తుంది. పురాణాలలో రంతిదేవుడు, శిబి చక్రవర్తి, ధర్మవ్యాధుడు లాంటి ఎన్నో కథలు ఈ శీలం గురించి చెప్పాయి. క్షత్రియ ధర్మాన్ని అనుసరించాల్సిన అర్జునుడు యుద్ధం చేయబోనని కర్తవ్య విముఖుడైన సందర్భంలో కృష్ణుడు చేసిన ధర్మబోధ భగవద్గీతగా ప్రసిద్ధమైంది.

 గజేంద్రమోక్ష గాథలో కరికి, మకరికి మోక్షాన్ని ఇవ్వడం వల్ల ప్రకృతిలోని ఏ జీవియైనా సమర్పణాభావనతో చేసే ప్రార్థనలు భగవంతుని వద్దకు చేరుస్తాయని అర్ధం అవుతున్నది. చివరగా.. పూజలు, ద్యానం, యజ్ఞాలు మనలో సకారాత్మక శక్తిని పెంచుతాయి. 

హుండీలలో మనం వేసే కానుకలు మనలో త్యాగభావన పెంచుతాయి. వ్యవస్థ కొనసాగడానికి ఉపయోగపడతాయి. అంతేకానీ, చేసిన తప్పులను మాఫీ చేస్తాయని, పాపాలను అవి కడిగేస్తాయని దేవుడు చెప్పలేదు. దేవుడు ఎవరితోనూ చెప్పుడు కాని సత్య దర్శనం చేసిన మహాఋషులు దర్శించి, ప్రవచించిన పురాణాలు అదే త్యాగభావన పెంచుకోమని నొక్కి వక్కాణిస్తున్నవి.