విజయ్ రాజీనామా చేసే స్థానం ఇదే.. మెజార్టీ తక్కువ రావడమే కారణమా..?

విజయ్ రాజీనామా చేసే స్థానం ఇదే.. మెజార్టీ తక్కువ రావడమే కారణమా..?

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. టీవీకే పార్టీతో పాటు విజయ్ కూడా సంచలన విజయాలు నమోదు చేశారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు చోట్ల పోటీ చేసిన విజయ్.. రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం విజయ్ రెండింట్లో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలి. దీంతో విజయ్ ఏ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతారు..? ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారు..? అనే అంశంపై తమిళనాడు రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. 

ఈ క్రమంలో విజయ్ తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకుంటారని టీవీకే వర్గాల సమాచారం. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విజయ్ గానీ, టీవీకే పార్టీ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తిరుచ్చి నుంచి  27,416 ఓట్లు, పెరంబూర్‌లో 53,715 ఓట్ల భారీ మెజారిటీతో విజయ్ గెలిచారు. పెరంబూర్‎తో పోలిస్తే తిరుచ్చిలో మెజార్టీ తక్కువగా రావడంతో ఈ స్థానాన్ని వదులుకునేందుకు విజయ్ మొగ్గు చూపుతున్నట్లు టాక్. మరికొన్ని రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ రానుంది. 

తొలి ఎన్నికల్లోనే టీవీకే ప్రభంజనం: 

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ అరంగేట్రంలోనే అదరగొట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయంతో అధికారానికి చేరువైంది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ మొత్తం 234 సీట్లకుగాను108 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో అధికార డీఎంకే పార్టీ 73 స్థానాలకు, ప్రతిపక్ష అన్నాడీఎంకే 53 సీట్లకు పరిమితమయ్యాయి. అయితే, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌(118 సీట్లు)కు మరో10  సీట్ల దూరంలో నిలిచిపోయింది.