సర్కార్ చేతికి అవినీతి అధికారుల చిట్టా.! ఇప్పటికే 5 శాఖలకు సంబంధించి సర్కారుకు 18 రిపోర్టులు

సర్కార్ చేతికి అవినీతి అధికారుల చిట్టా.!  ఇప్పటికే 5 శాఖలకు సంబంధించి సర్కారుకు 18 రిపోర్టులు
  • ఈ ఏడాది ఇప్పటికే 5 శాఖలకు సంబంధించి సర్కారుకు 18 రిపోర్టులు
  • మున్సిపల్‌‌, ఎస్‌‌ఆర్‌‌‌‌వో, ఆర్టీఏ ఆఫీసుల్లో అవినీతి అధికారులు
  • ఏజెంట్లు, దళారుల సాయంతో అందినకాడికి దోపిడీ
  • ఏసీబీ నివేదికల ఆధారంగా విజెలెన్స్ విచారణకు ఆదేశాలు

హైదరాబాద్‌‌, వెలుగు:  ఆన్​లైన్​లో అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన మీ ఫైలు ముందుకు కదలదు. ఒక్కో ఆఫీసులో ఒక్కో వ్యక్తిని ‘పర్సనల్’గా కలవాల్సి ఉంటుంది. లేదంటే రకరకాల కొర్రీలతో మీ డాక్యుమెంట్ పక్కన పడేస్తారు. అది రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అయినా.. ఇండ్ల పర్మిషన్ కోసం జీహెచ్​ఎంసీ కార్యాలయం అయినా.. డబ్బులు ముట్టజెప్తేనే మీ ఫైల్​కు అప్రూవల్ దొరుకుతుంది. పోలీస్ స్టేషన్లలో అయితే.. కేసును బట్టి రేటు ఫిక్స్ చేస్తారు. టోల్​ఫ్రీ నంబర్ 1064కు వచ్చే ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఏసీబీ ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులు.. ఆయా ఆఫీసుల్లో జరుగుతున్న అవినీతిని తెలియజేస్తున్నాయి. పలువురు గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. 

ఆ ఐదు శాఖల్లో అడ్డగోలు అవినీతి..

అడ్డగోలు అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వివిధ శాఖలపై ఏసీబీ నిఘా పెట్టింది. ప్రజల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న మున్సిపల్, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్‌‌‌‌, ఆర్టీఏ, పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్లపై స్పెషల్​గా ఫోకస్ పెట్టి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నది. టోల్‌‌ఫ్రీ నంబర్‌‌‌‌1064కు వస్తున్న ఫిర్యాదులు, మీడియా కథనాల ఆధారంగా ఈ రిపోర్టులు తయారు చేస్తున్నది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 18 రిపోర్టులు సబ్మిట్ చేయగా.. వీటి ఆధారంగా ఆయా శాఖలపై విజిలెన్స్‌‌ విచారణకు సర్కారు ఆదేశిస్తున్నది. ఓవైపు రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుబడిన 
167 మందితో పాటు మొత్తం 177 కేసులకు సంబంధించి పూర్తి రిపోర్టులను ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను బట్టి అవినీతిలో మున్సిపల్‌‌, రెవెన్యూ, ఆర్టీఏ, ఎస్‌‌ఆర్‌‌‌‌వో, పోలీస్ డిపార్ట్‌‌మెంట్లు టాప్​5లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు.

ఏసీబీకి చిక్కకుండా అధికారుల ఎత్తులు

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వం చాలా రకాల సేవలను ఆన్‌‌లైన్‌‌ లో అందిస్తున్నది. దీంతో అవినీతికి అడ్డుకట్ట పడ్తుందని సర్కారు భావించింది. కానీ, కొందరు ఉద్యోగులు అక్కడ కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఏసీబీ ఎంక్వైరీల్లో తేలింది. రెవెన్యూ, మున్సిపల్, ఆర్టీఏ తదితర శాఖల్లో ఆన్‌‌లైన్‌‌లో అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినా పలువురు అధికారులు కొర్రీలు పెడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ‘‘మున్సిపల్, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్‌‌‌‌, ఆర్టీఏ ఆఫీసుల్లో ఏ కారణం చెప్పకుండానే అప్లికేషన్లు రిజెక్ట్‌‌ చేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారు నేరుగా సదరు అధికారిని కలవాల్సి వస్తున్నది. డబ్బులు ఇస్తేనే పని జరుగుతున్నది. లేదంటే ఏజెంట్లు, దళారులు, కంప్యూటర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది’ అని ఏసీబీలోని ఓ అధికారి ‘వెలుగు’తో పేర్కొన్నారు.

అవినీతి అధికారుల చుట్టూ ఏసీబీ స్కెచ్‌‌, ప్రభుత్వానికి నివేదిక

అవినీతి ఎక్కువగా జరుగుతున్న డిపార్ట్‌‌మెంట్లపై పూర్తి సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఛాంబర్లు, పరిసర ప్రాంతాల్లో నిఘా వేసి.. స్థానికులు, ఆఫీసులకు వచ్చే వారితో మాట్లాడుతూ అవినీతిపై ఆరా తీస్తున్నారు. ఆఫీసుల్లో దళారులు, ఏజెంట్లపై నిఘా పెడుతున్నారు. ఏ పనికి ఎంత వసూలు చేస్తున్నారో కూడా తమ రిపోర్ట్​లో పేర్కొంటున్నట్లు తెలిసింది. ఏసీబీ నివేదికల ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్‌‌ విచారణకు ఆదేశిస్తున్నది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్​స్టేషన్లు సివిల్ దందాలకు అడ్డాలుగా మారాయి. కేసును బట్టి స్టేషన్ బెయిల్ కోసం వేలు, లక్షల్లో ముట్టజెప్పాల్సి వస్తున్నది.

అడిగినంత ఇస్తేనే.. ఆన్‌‌లైన్‌‌లో అప్రూవల్‌‌

ఏసీబీ అధికారులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టు పక్కల మున్సిపాలిటీలు అవినీతికి అడ్డాలుగా మారాయి. టౌన్‌‌ప్లానింగ్‌‌ విభాగంలో భారీగా అవినీతి జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని డాక్యుమెంట్లు అందజేసినా.. ఇంటి నిర్మాణాలకు అనుమతులు జారీ చేయకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మధ్యవర్తులు, ఏజెంట్లను కలిస్తే తప్ప ఫైల్‌‌ ముందుకు కదలడంలేదు. రూ.50 వేల దగ్గర నుంచి నిర్మాణాన్ని బట్టి లక్షల్లో రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. అడిగినంత ఇస్తే తప్ప పర్మిషన్లు ఇవ్వడం లేదు. రేషన్ కార్డుల జారీకి కూడా అధికారులు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేలాది మంది అనర్హులకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో డాక్యుమెంట్‌‌ రైటర్లు, రియల్టర్ల హవా

స‌‌బ్ రిజిస్ట్రేష‌‌న్ ఆఫీసుల్లో రియల్ ఎస్టేట్‌‌ వ్యాపారులు, ఏజెంట్లు, డాక్యుమెంట్‌‌ రైటర్ల హవా నడుస్తున్నది. ఇండ్ల స్థలాల దగ్గర్నుంచి భూముల రిజిస్ట్రేషన్ తో పాటు ఏ పని కావాలన్నా ఏజెంట్లను కలవాలి. ఏజెంట్ల విజిటింగ్ కార్డులు, డాక్యుమెంట్లపై కలర్‌‌‌‌ కోడ్‌‌తో ఆఫీసుల్లో అవినీతి దందా సాగుతున్నది. ఫ్లాట్‌‌ కొనాలన్నా.. అమ్మాలన్నా ఫీజులతో సహా ఏజెంట్లు ఫిక్స్ చేసిన రేట్‌‌ ఇచ్చుకోవాల్సిందే. సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్లను ఏజెంట్లుగా పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏసీబీకి భారీ ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.