V6 News

తెలంగాణ పేరుతో ఇన్ని పార్టీలు వచ్చాయా..? విజయ ఢంకా మోగించినవెన్నీ

తెలంగాణ పేరుతో ఇన్ని పార్టీలు వచ్చాయా..? విజయ ఢంకా మోగించినవెన్నీ

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచీ తెలంగాణ అంటే ప్రత్యేక చైతన్యం ఉన్న ప్రాంతం. దేశం అంతా బ్రిటిష్ పాలన కింద ఆంగ్ల విద్య, అభివృద్ధిని చవిచూస్తే.. తెలంగాణ నిజాం పాలనలో ఎంతో వెనుకబాటుకు గురవుతూ వచ్చింది. స్వతంత్ర్యంగా ఉంటేనే స్వీయ అస్థిత్వం ఉంటుందనీ.. స్వపరిపాలనతోనే సబ్బండ వర్గాల అభివృద్ధి సాధ్యమని ప్రత్యేక స్వరం వినిపిస్తూ వస్తున్న నేల. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో విలీనం తర్వాత ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో ఉద్యమిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో ప్రజా సంస్థలు, రాజకీయ పార్టీలు పురుడుపోసుకున్నాయి.  లేటెస్టుగా కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటుతో తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఈ సందర్భంగా తెలంగాణ పేరున ఇక్కడ ఏర్పడిన పార్టీల లిస్టేంటో ఓసారి చూద్దాం.

 

  • తెలంగాణ ప్రజా సమితి (TPS):

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ పేరుతో ఏర్పడిన మొట్టమొదటి పార్టీ. 1969లో  అనంతుల మదన్ మోహన్ ఈ పార్టీని స్థాపించగా.. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ శక్తిగా నిలదొక్కుకుంది. 1971లో మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో 10 లోక్ సభ స్థానాలు సాధించి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. 

  • జై తెలంగాణ పార్టీ (JTP): 

ఈ పార్టీని పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1998లో స్థాపించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి.. మంత్రిగా పనిచేసిన ఆయన.. ప్రత్యేక తెలంగాణ సాధన దిశగా ఈ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 

తెలంగాణ పేరుతో ఏర్పడిన మిగతా పార్టీలు దాదాపు మలిదశ ఉద్యమం తర్వాత ఏర్పడినవే. అందులో ముఖ్యమైన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి.

  • తెలంగాణ రాష్ట్ర సమితి/భారత రాష్ట్ర సమితి (TRS/BRS): 

మలిదశ ఉద్యమంలో భాగంగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ స్థాపించారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి (BRS)గా పేరు మార్చుకుంది.

ఆ తర్వాత తెలంగాణ పేరుతో వచ్చిన కొన్ని పార్టీల లిస్టు:

  • తల్లి తెలంగాణ పార్టీ  (TTP): 

విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ (TTP) స్థాపించారు. 1998లో బీజేపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, 2005లో సొంత పార్టీ పెట్టి, 2009లో దానిని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. 

  • నవ తెలంగాణ పార్టీ :

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2008 జూలై 11న తుళ్ల దేవేందర్ గౌడ్ స్థాపించిన రాజకీయ పార్టీ నవ తెలంగాణ ప్రజా పార్టీ. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పార్టీ, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర వాదాన్ని బలంగా వినిపించింది. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో విలీనం అయ్యింది.

  • తెలంగాణ జన సమితి (TJS) : ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. 2009-2014 మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, T-JAC ఛైర్మన్‌గా వ్యవహరించిన కోదండరాం, తెలంగాణ ఆకాంక్షల సాధన కోసం ఈ పార్టీని స్థాపించారు
  • తెలంగాణ సాధన సమితి (TSS): 2001లో ఆలె నరేంద్ర స్థాపించారు. ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ లో విలీనం చేశారు. 
  • తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాకవి, విప్లవ గాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) నేతృత్వంలో 2010 అక్టోబర్ 09న  ఏర్పడిన ఒక సామాజిక-రాజకీయ వేదిక. 
  • తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (TUF): కేశవరావు జాదవ్, విమలక్క తదితరులు 2011, ఫిబ్రవరి 21న ఏర్పాటు చేశారు. 
  • తెలంగాణ ఇంటి పార్టీ: 2017లో చెరుకు సుధాకర్ ఏర్పాటు చేశారు. 
  • తెలంగాణ నగారా సమితి: 2011లో నాగం జనార్ధన్ రెడ్డి ఏర్పాటు చేశారు. 

మరికొన్ని పార్టీలు:

  • తెలంగాణ రక్షణ సమితి –డాక్టర్.రాజేశ్వర్ రావు
  • తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ – విమలక్క
  • Ysr తెలంగాణా పార్టీ –షర్మిల
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ – తీన్మార్ మల్లన్న
  • తెలంగాణ రాష్ట్ర సేన–  కవిత (2026)