మీ దేశ బడ్జెట్ కంటే మా కాశ్మీర్ బడ్జెట్టే ఎక్కువ!: పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు....

మీ దేశ బడ్జెట్ కంటే మా కాశ్మీర్ బడ్జెట్టే ఎక్కువ!: పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు....

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా పాకిస్తాన్‌పై భారత్ మరోసారి విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ, భారత ప్రతినిధి అనుపమ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ వాస్తవాలను చూడకుండా ఏదో ఊహల్లో బతుకుతోందని భారత్ ఎద్దేవా చేసింది. పాకిస్తాన్ ఐఎంఎఫ్ (IMF) నుంచి అడుక్కుంటున్న అప్పు కంటే, మా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి బడ్జెట్ రెట్టింపు ఉంది. ఇది నమ్మలేకపోతే మీరు కలల లోకంలో ఉన్నట్లే  అని భారత్ విమర్శించింది. 

జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని భారత్ స్పష్టం చేసింది. 1947లో జరిగిన విలీనం చట్టబద్ధమైనదని, దాన్ని ఎవరూ మార్చలేరని తేల్చి చెప్పింది. అసలు వివాదం ఏదైనా ఉంటే.. అది పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగాల (POK) గురించేనని, వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. కాశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన 'చీనాబ్ రైల్వే వంతెన' వంటి కట్టడాలు అక్కడి అభివృద్ధికి నిదర్శనమని భారత్ పేర్కొంది.

►ALSO READ | వరంగల్ ఎంపీ కడియం కావ్యకు అరుదైన గౌరవం

 సొంత దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలే పూర్తి కాలం అధికారంలో ఉండని పాకిస్తాన్, మా ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం హాస్యాస్పదం అని భారత్ ఎద్దేవా చేసింది. పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కాశ్మీర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, కానీ అక్కడి ప్రజలు ఓటు ద్వారా హింసను తిరస్కరించి అభివృద్ధిని కోరుకుంటున్నారని భారత్ వివరించింది. పక్క దేశాల మీద పడి ఏడవడం మానేసి, పాకిస్తాన్ సొంత దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని,  గొడవలను సరిదిద్దుకుంటే మంచిదని భారత్ హితవు పలికింది.