రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కవితకు సీబీఐ నోటీసులు అందడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర కామెంట్స్ చేశారు. సోనియా రాహుల్ గాంధీని  ఆఫీస్ కి పిలిచి విచారించిన అధికారులు... ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎందుకలా వ్యవహరించడం లేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటేనని చెప్పారు.. ఎమ్మెల్సీ రమణను కార్యాలయానికి పిలిచి విచారించిన అధికారులు.. ఎమ్మెల్సీ కవిత తన ఇంటికి వచ్చి వివరణ తీసుకోమని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. రమణ, కవిత ఇద్దరూ ఒకే పార్టీ అయినప్పుడు విచారణలో వ్యత్యాసం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇతరులకు ఒక న్యాయం, ముఖ్యమంత్రి కూతురుకి ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. 

రైతుల సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ పోరాటం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం, కేంద్రం ఇద్దరూ దొంగలేనని, ఇద్దరి మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆరోపించారు. రుణ మాఫీ వడ్డీ చెల్లింపుకే పోతుందన్న ఆయన... రుణ మాఫీ పథకం కాదు వడ్డీ మాఫీ పథకమని విమర్శించారు. 4 ఏళ్లు గడుస్తున్నా రూ.1లక్ష రుణ మాఫీ కాలేదని విరుచుకుపడ్డారు. కేవలం రూ.30 వేలు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడిపోయిందన్నట్లుగా ధరణీతో సమస్య మరింత పెరిగిందని చెప్పారు. క్వింటాల్ కి 5 కిలోలు కోత విధిస్తున్నారని, తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇదే కొనసాగుతోందన్నారు. అధికారుల యంత్రాంగం చేతిలో ఉన్నా అరికట్టలేకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. వడ్డీ చెల్లిస్తేగానీ కొత్త రుణం ఇవ్వడం లేదన్న జీవన్ రెడ్డి... ఎస్సార్ఎస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయాలని కోరారు.

రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన రాయితీలన్నీ అమలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణి వెబ్ సైట్ తో రైతుల భూ సమస్యలు ఎక్కువ అయ్యాయన్న ఆయన... అక్షాంశ, రేఖాంశల ఆధారంగా హద్దులు నిర్ణయించేందుకు 
కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రాష్ట్రానికి రూ.120 కోట్లు నిధులు ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పరంగా చేపడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చక్కెర ఫ్యాక్టరీని మూసివేసిందని తెలిపారు. ముఖ్యమంత్రికి చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముందుగా 51 శాతం వాటా తేల్చాలన్న జీవన్ రెడ్డి... చక్కెర ఫ్యాక్టరీ ఎలా నడిపించాలో చెప్తానన్నారు.

2018లో  సూరమ్మ ప్రాజెక్ట్ కు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు, టెండర్ అయింది కానీ కొత్తది కట్టలేదని, ఉన్నది తెగిపోయిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. నారాయణపూర్ మత్తడి నిర్మాణానికి అనుగుణంగా కట్ట నిర్మించలేదని చెప్పారు. 1.60 లక్ష ఎకరాలకు సాగుకు నీరందించే నారాయణపూర్ రిజర్వాయర్ ఎండిపోయిందని తెలిపారు. అరగుండాల ప్రాజెక్ట్ పునర్నిర్మాణం కోసం ఎటువంటి చర్యలు తీసుకో లేదన్న ఆయన.. మోతే చెరువుకు రెండు సార్లు గండి పడిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కాంగ్రెస్ చేపడుతున్న నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.