
హైదరాబాద్, వెలుగు: కమీషన్లు తీసుకొంటూ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్‌తో హౌసింగ్, బిజినెస్ లోన్స్ ఇప్పిస్తున్న రెండు ముఠాల గుట్టురట్టైంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, లేబర్ డిపార్ట్‌మెంట్స్‌కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లతో లోన్లు ప్రాసెస్ చేస్తున్న18 మందిని బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
వీరి నుంచి రూ.10 కోట్లు విలువ చేసే 1,180 ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు, 687 ఫేక్ రబ్బర్ స్టాంప్స్, ట్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి అడ్డాగా సాగుతున్న ఈ దందా వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మేడ్చల్ జిల్లా సూరారానికి చెందిన ఘంట రంగారావు(63) ఏడేండ్లుగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నాడు.
కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన స్టాంప్ మేకర్ శివన్నగారి మణిప్రభు(62), సూరారానికి చెందిన కాగితాల సీతారామరాజు(37)తో కలిసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు తయారు చేసేవారు. బ్యాంకుల్లో హౌసింగ్, బిజినెస్, ఇతర లోన్లకు కావలసిన డాక్యుమెంట్స్, సర్జిఫికెట్లు ప్రింట్ చేసేవారు. అధికారుల సంతకాలను రామారావు ఫోర్జరీ చేసేవాడు.
వీటిని కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఏజెంట్ పంచికర్ల నాగ మల్లేశ్వర రావు(37) ఆల్విన్ కాలనీకి చెందిన ఫైనాన్సియల్ కన్సల్టెంట్ కొత్తపల్లి సుధాకర్ రావు(54)తో కలిసి కస్టమర్లకు అందించేవారు. చింతల్‌కు చెందిన ఆర్కిటెక్చర్ కొండేటి చంద్రశేఖర్ రావు(38) లేఔట్స్‌ను ట్యాంపర్ చేసేవాడు.
దందాలో నాలుగు కన్సల్టెన్సీలు
కూకట్‌పల్లిలోని ఏబీఏ లోన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిధి అసోసియేట్స్, ఆర్‌ఆర్ అసోసియేట్స్, డీఎమ్‌కే అసోసియేట్స్ బిజినెస్ లోన్ కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్నాయి. వివిధ వ్యాపారాల నిమిత్తం బ్యాంక్ లోన్ తీసుకునే వారికి ప్రాసెస్ చేస్తుంటాయి. కస్టమర్లు కోరినంత లోన్స్ ఇప్పించేందుకు అవసరమైన లేబర్ లైసెన్స్, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లను రంగారావు గ్యాంగ్ ద్వారాసేకరిస్తునారు. డాక్యుమెంట్స్ కోసం రూ.10వేల వరకు ప్రాసెసింగ్ ఫీజ్, లోన్ అమౌంట్‌లో 2 శాతం నుంచి 3శాతం వరకు కమీషన్ తీసుకునేవారు.
ఎస్‌బీహెచ్, యూబీఐ, పీఎన్బీ, కర్నాటక, మహారాష్ట్ర బ్యాంకుల్లో ఎక్కువ లోన్లు ప్రాసెస్ చేశారు. పోలీసుల సోదాల్లో ఏబీఎల్ లోన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వంక నాగిరెడ్డి(24) నిధి అసోసియేట్స్‌కు చెందిన కరిమి షణ్ముకరావు(37)ఆర్ఆర్ అసోసియేట్స్‌కి చెందిన కొల్లి రామరాజు(36) డీఎమ్‌కే అసోసియేట్స్‌కు చెందిన దొంతుల మణికంఠ(33) మరో 8 మంది ఏజెంట్లను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.