
- మొత్తం ఐదు విడతల్లో నిర్వహణ
- మొదట రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ
- అక్టోబర్ 9, 13న నోటిఫికేషన్.. 23, 27న పోలింగ్.. నవంబర్ 11న రిజల్ట్
- మూడు విడతల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్స్.. ఏ రోజుకారోజే ఫలితాలు
- అక్టోబర్ 17, 21, 25న నోటిఫికేషన్.. అక్టోబర్ 31, నవంబర్ 4, 8న పోలింగ్
హైదరాబాద్, వెలుగు:పల్లెల్లో ఎన్నికల పోరు షురువైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది. తొలుత పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లను రెండు విడతల్లో నిర్వహించనుండగా.. ఆ తర్వాత మూడు విడతల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు పెట్టనుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది.
ఈ మేరకు రాష్ట్రంలోని 31 జిల్లాలు, 565 మండలాలకు సంబంధించి స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సోమవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న ఉన్నప్పటికీ, షెడ్యూల్ ప్రకటనతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీని కోరారు.
తొలి విడతలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాణి కుముదిని తెలిపారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని, 23న పోలింగ్ ఉంటుందని చెప్పారు. రెండో విడతలో 2,786 ఎంపీటీసీ, 273 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని.. అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని, అక్టోబర్ 27న పోలింగ్ఉంటుందని వెల్లడించారు.
రెండు విడతల్లో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న చేపట్టి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ‘‘12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తాం. వరుసగా అక్టోబర్ 13, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి.
తొలి విడతలో 1,998 పంచాయతీలకు అక్టోబర్ 31న, రెండో విడతలో 5,414 పంచాయతీలకు నవంబర్ 4, మూడో విడతలో 5,321 పంచాయతీలకు నవంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల రోజే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తాం” అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,12,770 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని..వీటిలో ఎంపీటీసీలకు 15,302, జడ్పీటీసీలకు 31,377, సర్పంచ్ ఎన్నికలకు 15,222 పోలింగ్ స్టేషన్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. మిగతావి వార్డు మెంబర్లకు సంబంధించినవి ఉన్నట్టు చెప్పారు.