తెలంగాణలోని పలు జిల్లాల్లో గో బ్యాక్‌‌ మార్వాడీ పేరుతో నిరసన

తెలంగాణలోని పలు జిల్లాల్లో గో బ్యాక్‌‌ మార్వాడీ పేరుతో నిరసన

 

  •     భువనగిరి, జమ్మికుంటలో స్వర్ణకారులు, కార్పెంటర్‌‌ అసోసియేషన్‌‌ సభ్యుల ఆందోళన
  •     హైదరాబాద్‌‌ హబ్సిగూడలో గోల్డ్‌‌ షాప్‌‌ ఎదుట టైర్లు కాల్చిన ఓయూ జేఏసీ


యాదాద్రి/జమ్మికుంట, వెలుగు : ‘గో బ్యాక్‌‌ మార్వాడీ’ పేరుతో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్థానిక వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా భువనగిరిలో స్వర్ణకారులు తమ షాపులను మూసివేసి నిరసన తెలిపారు. పలువురు మాట్లాడుతూ మార్వాడీల కారణంగా తమ ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోల్డ్‌‌తో పాటు అన్ని వ్యాపారాలు చేస్తూ, వాళ్ల షాపుల్లో సైతం మార్వాడీలకే ఉపాధి కల్పిస్తున్నారని మండిపడ్డారు. తక్కువ రేటుకునాసిరకం వస్తువులు అమ్ముతున్నారని ఆరోపించారు. 

కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంటలో శ్రీ విశ్వకర్మ కార్పెంటర్‌‌ వెల్ఫేర్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో బంద్‌‌కు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ గౌడ్‌‌ తన సిబ్బందితో కలిసి అసోసియేషన్‌‌ సభ్యులను ముందస్తుగా అరెస్ట్‌‌ చేసి స్టేషన్‌‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్‌‌ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌‌ మాట్లాడుతూ మార్వాడీలకు తాము వ్యతిరేకం కాదని కానీ వారి వ్యాపార విధానాలతో తాము ఉపాధిని కోల్పోతున్నామని చెప్పారు. గతంలో హైదరాబాద్‌‌కే పరిమితమైన మార్వాడీ వ్యాపారులు, కార్మికులు ప్రస్తుతం పల్లెలకు సైతం వచ్చి స్థానిక కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సూరాచారి, కైరోజు రాజమౌళిచారి, దురిశెట్టి రాజుచారి, పోలోజు రవీంద్రచారి పాల్గొన్నారు.

హైదరాబాద్‌‌ హబ్సిగూడలో నిరసన

ఓయూ, వెలుగు : ‘గో బ్యాక్ మార్వాడీ’ ఆందోళనలో భాగంగా హైదరాబాద్‌‌లోని హబ్సిగూడలో ఉన్న ఓ గోల్డ్‌‌షాప్‌‌ ఎదుట ఓయూ జేఏసీ నాయకులు, ఆదివాసీ స్టూడెంట్‌‌ యూనియన్‌‌ నాయకులు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. తెలంగాణ బంద్‌‌కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్‌‌ కొత్తపల్లి తిరుపతి, వేణుగోపాల్‌‌ను విడుదల చేయాలని డిమాండ్‌‌ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్ట్‌‌ చేసి స్టేషన్‌‌కు తరలించారు. నిరసనలో ఓయూ జేఏసీ వైస్‌‌చైర్మన్‌‌  పాపారావు 
మాట్లాడారు.