జేఎల్‌‌ఎం నియామకాలకు స్థానికత వర్తించదు: హైకోర్టు

జేఎల్‌‌ఎం నియామకాలకు స్థానికత వర్తించదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్‌‌ శాఖలో మిగిలిన 553 జూనియర్‌‌ లైన్‌‌మన్‌‌(జేఎల్‌‌ఎం) పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్‌‌ సదరన్‌‌ పవర్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌(టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్‌‌ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికత లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్షను నిర్వహిస్తే.. అందులో మెరిట్ సాధించిన వారితోనే మిగిలిన 553 పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న పోస్టుల్లో 1900 భర్తీ చేశాక..మిగిలిన 550 పోస్టులను కొత్త జిల్లాల ప్రాతిపదికగా స్థానికులతో(95 శాతం) పోస్టులు భర్తీ చేస్తామనడం చెల్లదని వెల్లడించింది. 

2019లో టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ 2,500 జేఎల్‌‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్‌‌ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాకు చెందిన తిరుమలేశ్‌‌ హైకోర్టులో 2020లో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై జస్టిస్‌‌ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్‌‌ఎం పోస్టులకు వర్తింపజేయలేమని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌‌గా తీసుకుని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయరాదన్నారు. కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్‌‌ లోకల్‌‌ కారని స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 1900కు పైగా పోస్టులను అధికారులు భర్తీ చేయగా.. మిగిలిన ఖాళీలను మెరిట్‌‌ ప్రకారం అదే నోటిఫికేషన్‌‌కు అనుగుణంగా భర్తీ చేయాలని ఆదేశించారు.

మైనింగ్ పనులు ఆపేయండి: నవ భారత్ ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ తవ్వకాలపై హైకోర్టు స్టే

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం అగ్రహార కాచారం గ్రామంలో నవ భారత్ ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ చేపడ్తున్న మైనింగ్‌‌ పనుల్ని నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. క్వారీ తవ్వకాలను తాత్కాలికంగా ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా రావడంతో గతంలో రద్దు చేసిన లీజును అధికారులు తిరిగి నవ భారత్‌‌కు పునరుద్ధరించడాన్ని సవాల్‌‌ చేస్తూ దేవరకొండకు చెందిన సుందరయ్య, పలువురు హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ భీమపాక నగేష్‌‌.. మైనింగ్‌‌ పనులు ఆపేయాలని స్టే ఇచ్చారు. అడ్వకేట్ రమేశ్‌‌ చిల్ల వాద నలు వినిపిస్తూ.. ‘క్వారీ లీజును నవ భారత్‌‌ ఫెర్రో అల్లాయ్స్‌‌ లిమిటెడ్‌‌ కు రెన్యువల్‌‌ చేస్తూ మైన్స్‌‌ అండ్‌‌ జియాలజీ డైరెక్టర్‌‌ గతేడాది నవంబర్‌‌లో ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధని ఆయన పేర్కొన్నారు.