తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు
  • జూన్ 09 దాకా పొడిగించాలని నిర్ణయం
  • వీకెండ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్
  • కేబినెట్ భేటీలో నిర్ణయించిన సీఎం కేసీఆర్

రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ పొడిగింపు, కరోనా తీవ్రత, కరోనా ట్రీట్‌మెంట్ మొదలైన విషయాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం మే 12 నుంచి మే 21 వరకు లాక్‌డౌన్ విధించింది. అయినా కేసులు పెరగడంతో.. లాక్‌డౌన్ పొడిగించింది. మే 30 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా? అని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో ప్రజల భద్రత దృష్ట్యా మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 9 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేబినెట్‌లో నిర్ణయించారు. కాగా.. లాక్‌డౌన్ మినహాయింపును ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెంచాలని నిర్ణయించారు. గతంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఉండేది. అయితే ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మినహాయింపు సమయాన్ని పెంచాలని పలు విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో లాక్‌డౌన్ మినహాయింపు సమయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పెరిగింది. ఒంటి గంట తర్వాత ఇళ్లకు చేరుకోవడానికి మరో గంట సమయం అవకాశమివ్వనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.