దేశమంతటా మళ్లీ లాక్ డౌన్ వేయాలె

దేశమంతటా మళ్లీ లాక్ డౌన్ వేయాలె

ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు జిల్లాల్లో లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ విధించిన మహా ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తోంది. ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని లేదా లాక్ డౌన్ తప్పదని రాష్ట్ర మంత్రులు అంటున్నారు. ఈ విషయం మీద అధికార శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులలో కూడా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్ డౌన్ వేయడానికి వెనుకాడమని రౌత్ స్పష్టం చేశారు. 

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పై రౌత్ ఫైర్ అయ్యారు. కరోనా మీద యుద్ధాన్ని ఏదో పాకిస్థాన్ తో చేస్తున్న పోరులా చూడొద్దన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. 'ప్రకాశ్ జవదేకర్ జీ.. ఢిల్లీలో కూర్చొని లెక్చర్లు ఇవ్వడం కాదు. ఆయనకూ ఈ రాష్ట్రం విషయంలో బాధ్యత ఉంది. ఇక్కడికి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కానీ అనవసర రాజజీయాలు సరికాదు. మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఉద్దేశ్యంలో దేశ వ్యాప్తంగానూ లాక్ డౌన్ వేయాలి. కానీ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోడీయే. నాకు తెలిసి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిశాక ఈ దిశగా కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా' అని రౌత్ పేర్కొన్నారు.