లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అవసరం లేదు 

లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అవసరం లేదు 
  • కరోనాను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండండి
  • అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
  • వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు ఖాళీ అయితే 15 రోజుల్లోనే నింపాలె
  • ఐసోలేషన్, టెస్టింగ్ కిట్లు రెడీగుండాలె.. 
  • ఆక్సిజన్ ఉత్పత్తి కెపాసిటీ పెంచాలె  
  • ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలె  
  • రివ్యూలో కేసీఆర్​   


హైదరాబాద్, వెలుగు:  కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున సోమవారం ఆరోగ్యశాఖ అధికారులతో ప్రగతిభవన్‌‌లో ఆయన రివ్యూ నిర్వహించారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్ కంపల్సరీగా ధరించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసే కరోనా రూల్స్ తప్పకుండా పాటించాలన్నారు.  సర్కార్ దవాఖాన్లలో కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, 2 కోట్ల కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డాక్టర్, నర్సులు సహా అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఆరోగ్యశాఖలో ఖాళీలు ఏర్పడితే, 15 రోజుల్లోనే వాటిని భర్తీ చేసేలా గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పారు. జనాభాకు అనుగుణంగా దవాఖాన్లలో బెడ్లు, ఇతర సౌలతులు, స్టాఫ్ ను సమకూర్చుకోవాలన్నారు. కొత్త కలెక్టరేట్లలోకి మారుతున్నందున, పాత కలెక్టర్ ఆఫీసులను విద్య, వైద్యశాఖ అవసరాల కోసం కేటాయించాలన్నారు. 
ప్రభుత్వ దవాఖాన్లలోని 99 శాతం బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతం బెడ్లను కూడా ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం 324 టన్నులుగా ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, 500 టన్నుల వరకు పెంచాలన్నారు. డయాలసిస్‌‌ మిషన్ల సంఖ్యను పెంచాలని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారని సీఎంవో వెల్లడించింది. వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులుగా ఉండరాదని, బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలియజేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం లాక్ డౌన్ అవసరం లేదని వారు సీఎంకు వివరించినట్లు తెలిపింది. 
జిల్లాల్లో బస్తీ దవాఖాన్లు
బస్తీ దవాఖాన్ల సంఖ్యను పెంచాలని సీఎం నిర్ణయించారు. కంటోన్మెంట్ పరిధిలో వార్డుకు ఒకటి చొప్పున 6, రసూల్ పురలో -2, ఎల్బీనగర్‌‌‌‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జల్‌‌పల్లి, మీర్ పేట, పిర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేట్‌‌లో ఒక్కోటి చొప్పు బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 4, నిజామాబాద్- లో3,  మహబూబ్ నగర్-, నల్గొండ-, మిర్యాలగూడ, రామగుండం, ఖమ్మం,  కరీంనగర్-లో 2 చొప్పున, జగిత్యాల, సూర్యాపేట్, సిద్ధిపేట్,  కొత్తగూడెం, పాల్వంచ-, నిర్మల్, మంచిర్యాల, తాండూర్, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్ పూర్, గజ్వేల్, మెదక్-లో 1 చొప్పున బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రివ్యూలో మంత్రులు హరీశ్‌‌రావు, ప్రశాంత్‌‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రాం రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఎ. జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   
తెలంగాణ- ఏపీ సీఎస్‌‌‌‌‌‌‌‌ల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో తగ్గొద్దు
కేంద్ర హోం శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈనెల 12న జరిగే తెలంగాణ– ఏపీ చీఫ్ సెక్రటరీల సమావేశంలో అనుసరించాల్సిన విధి విధానాలపై సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పునర్విభజన చట్టానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటేనే సహకరించాలని, లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ‘‘ఏపీ అవసరం లేని వివాదాలు సృష్టిస్తూ.. విభజన చట్టంలో లేని అంశాలను కావాలని ముందుకు తెస్తున్నది.  విభజన చట్టానికి వ్యతిరేకంగా సింగరేణి వంటి సంస్థలలో వాటా కావాలని కోరడం వల్లే అనేక సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి’’ అని సీఎం వివరించారు. 
 

లాక్‌‌‌‌‌‌‌‌డౌన్, నైట్‌‌‌‌‌‌‌‌ కర్ఫ్యూ ఉండవ్: డీహెచ్‌‌‌‌‌‌‌‌
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌, నైట్‌‌‌‌‌‌‌‌కర్ఫ్యూ వంటి ఆంక్షలు ఉండవని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈనెల చివరలో లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ పెడతారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ సోమవారం ఆయన ఒక  ప్రకటన విడుదల చేశారు. ‘ఒమిక్రాన్, థర్డ్‌‌‌‌‌‌‌‌వేవ్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ రెడీగా ఉంది. రాష్ట్రంలో  నైట్ కర్ఫ్యూ, లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ ఉండబోవని ఇదివరకే చెప్పాం. మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. జనవరి చివరలో లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ ఉండొచ్చునని నేను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ప్రకటనలో శ్రీనివాసరావు పేర్కొన్నారు.