మెల్లమెల్లగా ఆంక్షలను సడలిస్తున్న రాష్ట్రాలు

మెల్లమెల్లగా ఆంక్షలను సడలిస్తున్న రాష్ట్రాలు
  •  ఢిల్లీలో నెలన్నర తర్వాత తెరుచుకున్న షాపులు 
  • మహారాష్ట్రలో మొదలైన ఫేజ్‌లవారీ సడలింపు
  •  తమిళనాడులో కేసులు తక్కువున్న దగ్గర అన్‌లాక్‌

న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుతుండటంతో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సోమవారం నుంచి ఆంక్షలను సడలించారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, గుజరాత్‌ ప్రభుత్వాలూ కొన్ని మినహాయింపులిచ్చాయి. దీంతో అనేక ప్రాంతాల్లో షాపులు, రెస్టారెంట్లు, మార్కెట్లు, ఆఫీసులు తెరుచుకున్నాయి. బస్సులు, మెట్రో రైళ్లు మొదలయ్యాయి.

ఢిల్లీలో సరి, బేసి పద్ధతిలో..
దాదాపు నెలన్నర తర్వాత ఢిల్లీలో అన్‌లాక్‌ మొదలైంది. జూన్‌ 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రభుత్వం.. సరి, బేసి పద్ధతిలో సడలింపులివ్వడంతో సోమవారం మార్కెట్లు, షాపులు తెరుచుకున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు వీటికి అనుమతిచ్చారు. మూడు వారాలుగా షట్‌డౌన్‌లో ఉన్న మెట్రో రైళ్లు కూడా మొదలయ్యాయి. ప్రైవేటు ఆఫీసులు కూడా 50 శాతం కెపాసిటీతో  తెరుచుకున్నాయి. స్పాలు, జిమ్ లు, ఎంటర్‌టైన్మెంట్‌ జోన్లు, పార్కులకు ఢిల్లీ సర్కారు అనుమతి ఇవ్వలేదు. సడలింపుల వల్ల జనం బయటకు రావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

మహారాష్ట్రలో ఐదు ఫేజ్‌లలో..
మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో కేసులు తగ్గిపోయాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వైరస్‌ తీవ్రతను బట్టి 5 ఫేజ్‌లలో సడలింపులిచ్చింది. 5 శాతం పాజిటివిటీ రేటు ఉన్న లేదా ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ రేటు 25 శాతం కన్నా తక్కువ ఉన్న నగరాలు, జిల్లాలను మొదటి ఫేజ్‌గా గుర్తించింది. ఈ జిల్లాలను సోమవారం నుంచి అన్‌లాక్‌ చేసింది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల దుకాణాలు, మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. వివాహాలు, అంత్యక్రియల‌కు అనుమ‌తిచ్చారు. లోక‌ల్ రైళ్లు కూడా మొదలయ్యాయి. ముంబైలో లెవెల్‌ 3 అన్‌లాక్‌ ప్రక్రియ అమలవుతోంది. ఫుల్‌ కెపాసిటీతో బస్సులను నడిపేందుకు అనుమతిచ్చారు. అయితే బస్సులో నిల్చొని ప్రయాణించకుండా ఆంక్షలు పెట్టారు.

తమిళనాడులో కేసులు తక్కువున్న జిల్లాల్లో..
తమిళనాడులో జూన్‌  14 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు. అయితే కేసులు తక్కువున్న జిల్లాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. కేసులు ఎక్కువున్న కోయంబత్తూర్‌ వంటి 11 జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో సడలింపులిచ్చారు. నిత్యావసర దుకాణాలు, కూరగాయల షాపులతో పాటు మాంసం, చేపల దుకాణాలు, ఎలక్ట్రిక్‌, వాహనాల విభాగాలు అమ్మే దుకాణాలకు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం మంది ఉద్యోగులు పని చేసుకోవచ్చంది.

ఉత్తరప్రదేశ్‌లో 4 జిల్లాలు మినహా.. 
ఉత్తరప్రదేశ్‌లో4 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను అక్కడి సర్కారు సడలించింది. కేసులు ఎక్కువున్న లక్నో, మీరట్‌, షహరన్‌పూర్‌, గోరఖ్‌పూర్‌లలో ఆంక్షలు అమలవుతాయంది. వారణాసి, ముజఫర్‌నగర్‌, గౌతమ్‌బుద్ధ నగర్‌, ఘజియాబాద్‌లలో కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట ఉన్న షాపులు, మార్కెట్లను తెరుచుకోవడానికి అనుమతిచ్చింది. వారానికి 5 రోజులు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుచుకోవచ్చంది. నైట్‌, వీకెండ్‌ కర్ఫ్యూ అమల్లోనే ఉంటుందని యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ వెల్లడించింది.

ఇంకిన్ని రాష్ట్రాల్లో ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను జూన్‌ 20 వరకు ప్రభుత్వం పొడిగించింది. అయితే కర్ఫ్యూ వేళల్లో 2 గంటలు సడలింపులిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తర్వాతి రోజు పొద్దున 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. హర్యానాలో జూన్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించినా.. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మార్కెట్లు, దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతిచ్చారు. రెస్టారెంట్లు, బార్లు, క్లబ్‌ హౌస్‌లను 50 శాతం కెపాసిటీతో నడుపుకోవచ్చని అనుమతి ఇచ్చారు. పంజాబ్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలను జూన్‌ 15 వరకు పొడిగించారు. షాపులను సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకోవడానికి పర్మిషన్‌ ఇచ్చారు. గుజరాత్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో జూన్‌ 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు.

ఓటున్నచోటే వ్యాక్సిన్
45 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్​ వేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ‘‘ఎక్కడ ఓటు ఉందో, అక్కడే వ్యాక్సిన్ (జహా​ ఓట్, వహా​ వ్యాక్సిన్)”క్యాంపెయిన్​లో భాగంగా అన్ని పోలింగ్ బూత్​లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బూత్​ లెవల్​ ఆఫీసర్స్​(బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి 45 ఏండ్లు పైబడిన వారి కోసం వ్యాక్సిన్​ స్లాట్​లను బుక్ చేస్తారని తెలిపారు. లబ్ధిదారుల ఇంటికి దగ్గర్లోనే పోలింగ్​ బూత్​లను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వమే రిక్షాలు ఏర్పాటు చేసి వారిని వ్యాక్సినేషన్​ సెంటర్లకు తరలిస్తుందన్నారు. నాలుగు వారాల్లోగా ఈ వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను కంప్లీట్​ చేస్తామన్నారు.