
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ( సంస్థాగత) కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ నెలలోనే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే.. ఒకట్రెండు రోజుల్లోనే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతున్నదని చెప్పారు. గురువారం సీడబ్ల్యూసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు అంశాలు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీడబ్ల్యూసీ తీర్మానాలు చేసిందన్నారు. తెలంగాణలో ఏడాది క్రితం మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిందన్నారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. గెలుపే లక్ష్యంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు.