లోక్ సభ బరిలో వారసులు?.. రేసులో సీనియర్​ నేతల కుటుంబ సభ్యులు

లోక్ సభ బరిలో  వారసులు?.. రేసులో సీనియర్​ నేతల కుటుంబ సభ్యులు
  • భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సతీమణి లక్ష్మి  
  • మల్కాజ్ గిరి నుంచి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి
  • ఖమ్మం బరిలో పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి 
  • పెద్దపల్లి నుంచి వివేక్ తనయుడు వంశీకృష్ణ 

వెలుగు, నెట్​వర్క్: త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తమ వారసులను బరిలో దింపేందుకు పలువురు సీనియర్​నాయకులు, ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్​ నేతల్లో చాలామంది తమ కుటుంబసభ్యులకు టికెట్​ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉండగా, బీఆర్ఎస్​లో కూడా కొందరు నేతలు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్​ను కోరుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​వచ్చే లోక్​సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో రూలింగ్​పార్టీలో  లోక్​సభ టికెట్ల కోసం పోటీ తీవ్రంగానే ఉంది.  సీఎం రేవంత్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి సీటు నుంచి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి  కొండల్ రెడ్డి ఆయన వెన్నంటే ఉంటున్నారు. కామారెడ్డిలో రేవంత్​ తరఫున ఒంటిచేత్తో ప్రచారం చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.  

ఖమ్మం సీటు కోసం ముక్కోణం 

 ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తమ కుటుంబ సభ్యులను బరిలో దింపాలని ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని,  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తమ్ముడు ప్రసాద్​రెడ్డి,  వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ టికెట్ ఆశిస్తున్నారు. హైకమాండ్​ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని మల్లు నందిని ఇదివరకే ప్రకటించారు. మధిరలో భట్టి వరుసగా నాలుగుసార్లు గెలవడం వెనుక నందిని కృషి ఉంది. మధిరలో పార్టీ కేడర్ కు అందుబాటులో ఉండే ఆమె.. అమ్మ ఫౌండేషన్​ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ, ఏడాది నుంచి ప్రజాక్షేత్రంలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో ఖమ్మం బహిరంగ సభలో రాహుల్​ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి ప్రసాద్​రెడ్డి తనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో శ్రీనివాస్​రెడ్డి తరఫున పాలేరు ప్రచార బాధ్యతలు నిర్వహించిన ప్రసాద్​రెడ్డి.. పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొదటి నుంచి పార్టీ క్యాడర్​కు సన్నిహితంగా ఉంటారన్న పేరుంది. తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్​కూడా టికెట్​రేసులో ఉన్నారు. తండ్రి తుమ్మల, మామ గరికపాటి మోహన్​రావు సీనియర్​ నేతలు కావడంతో ఆయన నేరుగా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. రెండు ఎన్నికల్లోనూ తుమ్మల ఎన్నికల ప్రచార బాధ్యతలు యుగంధర్​స్వయంగా చూసుకున్నారు.  

నల్గొండ నుంచి జానా కొడుకు.. 

నల్గొండ నుంచి తానే లోక్​సభకు పోటీ చేస్తానని పార్టీ సీనియర్​నేత జానారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏ కారణం వల్లనైనా తాను బరిలో దిగలేకపోతే తన కొడుకు రఘువీర్​రెడ్డితో పోటీ చేయించాలనే ఆలోచనతో ఉన్నారు. రఘువీర్ 2018లోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి గానీ, నల్గొండ లోక్​సభ సీటుకు గానీ పోటీ చేయాలని ప్రయత్నించారు. అప్పట్లో చాన్స్​మిస్సయినా ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనైనా పోటీలో ఉండాలని పావులు కదుపుతున్నారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి ఫ్యామిలీ బరిలోకి దిగాలని ఆశిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేస్తారని, లేదంటే వారి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్య పవన్ రెడ్డి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్​తరఫున నల్గొండ నుంచి శాసన మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుఖేందర్​రెడ్డి చాలాకాలంగా తన కుమారున్ని వారసుడిగా రాజకీయాల్లోకి తేవాలని ఆశిస్తున్నారు. హైకమాండ్​అంగీకరిస్తే అమిత్​లోక్​సభకు పోటీ చేస్తారని గుత్తా ఇదివరకే ప్రకటించారు.  

పెద్దపల్లి రేసులో గడ్డం వంశీకృష్ణ

చెన్నూర్​ఎమ్మెల్యే డాక్టర్​జి.వివేక్​వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ లోక్​సభ ఎన్నికల ద్వారా పొలిటికల్​ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పెద్దపల్లి లోక్ సభ సీటు నుంచి బరిలో నిలిచేందుకు ఇంట్రెస్ట్​చూపుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి  కాకా వెంకటస్వామి, వివేక్​వెంకటస్వామి ప్రాతినిధ్యం వహించారు. వారి ఫ్యామిలీకి పెద్దపల్లితో ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్​సభ పరిధిలోని ఏడింటికి ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్​పార్టీ ఘన విజయం సాధించింది. చెన్నూరులో ఎన్నికల ప్రచారం చేసిన వంశీకృష్ణ కు యూత్ లో బాగా ఫాలోయింగ్​పెరిగింది.