
నిజామాబాద్, వెలుగు: ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా శుక్రవారం ఫోన్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో ఎంపీ కాన్వాయ్‌పై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సహకారంతో రాష్ట్ర సర్కార్ తనను హత్య చేయించేందుకు ప్రయత్నించిందని స్పీకర్‌కు అర్వింద్ వివరించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్, ఇతర పోలీసుల తీరునూ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తన పర్యటనలో దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు తెలిపినా వారు ఎలాంటి భద్రత కల్పించలేదన్నారు. దాడి ఘటనపై వెంటనే ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేయాలని స్పీకర్ చెప్పారని, రెండ్రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ఆయనకు ఫిర్యాదు చేస్తానని అర్వింద్ తెలిపారు.