నేను ఆ బ్యాచ్ కాదు

నేను ఆ బ్యాచ్ కాదు

నిన్న శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను ఎగతాలి చేస్తూ మాట్లాడటాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పుబట్టారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆ సందర్భంగా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నాకు తెలుగులో మాట్లాడటం రాదని నిన్న శాసనసభలో నన్ను ఎగతాలి చేస్తూ మాట్లాడారు. నా తెలుగు భాష వల్ల ఏపీ ఏమైనా నష్టపోయిందా? పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా? పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయాయా? ప్రజల సమస్యలు వదిలేసి అనవసర విషయాలు వదిలేయాలని కోరుకుంటున్నాను. 11 కేసుల్లో ఉన్న వ్యక్తి, 16 నెలలు జైళ్లో ఉన్న వ్యక్తి నీతులు మాట్లాడటం అస్సలు బాగాలేదు. సొంత కొడుకును గెలిపించుకోలేకపోయారని అన్నారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదు. టీడీపీ ఎక్కడ గెలవలేదో.. అక్కడ గెలవాలని మంగళగిరి నుంచి పోటీ చేశాను. 1985 తర్వాత అక్కడ టీడీపీ గెలవలేదు. అందుకే అక్కడ టీడీపీ జెండా ఎగురవేయాలని అక్కడి నుంచి పోటీ చేశాను. ఆ చరిత్ర తిరిగిరాయాలనే లక్ష్యంతో నేను అక్కడికి వెళ్లాను. మంగళగిరి.. పులివెందుల కాదు.

నేను పుట్టిన నాటికే మా తాతగారు ముఖ్యమంత్రి. నేను స్కూల్‌కి వెళ్లే టైంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి. ఏనాడు నాపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు. నేను క్రమశిక్షణతో బతికిన వ్యక్తిని. నేను వారిలా వీధిరౌడిల్లాగా పెరగలేదు. ఏ తప్పు చేయకున్నా మాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కంపెనీలకు భూములు కేటాయిస్తే.. నేను అవినీతి చేశానని అన్నారు. మీ ప్రభుత్వం వచ్చి ఆర్నెల్లు అయ్యింది. మరి ఎందుకు నిరూపించలేదు. హెరిటేజ్‌పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం హెరిటేజ్‌ను 1992లో ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. మే దాన్ని ఫ్యూచర్ గ్రూప్ కంపెనీకి అమ్మేశాం. హెరిటేజ్‌లో మాకు షేర్లు మాత్రమే ఉన్నాయి. మీరు సాక్షి పేపర్ పెట్టినప్పుడు పేపరును రూ. 2 లకే అమ్మాలి అని ఉద్యమం చేశారు. మరి మీరిప్పుడు ఆ పేపర్ ధరను రూ. 5 ఎందుకు చేశారు? పెన్షన్ పెంచుతాం, రేషన్ పెంచుతాం అని చెప్పి.. ఇప్పుడు అన్నింటికి ధరలు పెంచుతున్నారు.

నేను లేని శాసనసభలో నా గురించి ఎగతాలి చేసి మాట్లాడిన మంత్రులు.. నేను ఉన్న శాసనమండలిలో మాత్రం నా పేరు కూడా ప్రస్తావించడం లేదు. అక్కడ లేని నా గురించి సభ్యులు మాట్లాడుతుంటే స్పీకర్ వారికి కనీసం అడ్డుకూడా చెప్పలేదు’ అని అన్నారు.