బీఆర్ఎస్లో లోక్ సభ టెన్షన్..కన్ ఫ్యూజన్ లో లీడర్స్, కేడర్

బీఆర్ఎస్లో లోక్ సభ టెన్షన్..కన్ ఫ్యూజన్ లో లీడర్స్, కేడర్
  • పలు స్థానాల్లో పోటీకి అభ్యర్థులు కరువు!
  • కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగులకు టికెట్ కట్  
  • నిజామాబాద్ అభ్యర్థిపై నో క్లారిటీ?
  • బలమైన క్యాండిడేట్ ల కోసం వేట!
  • దొరక కుంటే కేటీఆర్, హరీశ్ కూడా పోటీ చేస్తారా?
  • ఒక వేళ ఓడితే భవిష్యత్ ఎలా అనే బెంగ

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లు ఇచ్చి బొక్క బోర్లా పడ్డ బీఆర్ఎస్ లోక్  సభ ఎన్నికల వేళ టెన్షన్ పడుతోంది. కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఆ పార్టీ లీడర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు 17 పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎంపీలు విభిన్నమైన వాదనలు వినిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలనూ విశ్లేషించారు. సమావేశాల నేపథ్యంలో కేటీఆర్ కేవలం మూడు నాలుగు సెగ్మెంట్లలో మాత్రమే సిట్టింగులకు సీట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మిగతా సెగ్మెంట్లలో ఎవరిని బరిలోకి దింపుతారనేది తేలడం లేదు.  2019లో ఎమ్మెల్సీ కవిత పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కూడా అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు రావడంతో అక్కడ పోటీ చేయడం వల్ల మరో మారు ఓటమి తప్పదని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. మెదక్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన బరిలో ఉండరనే వాదన అంతకంటే బలంగా వినిపిస్తోంది. అక్కడి నుంచి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని గానీ, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని గానీ బరిలోకి దింపుతారని తెలుస్తోంది.

 ఆదిలాబాద్ నుంచి గతంలో పోటీ చేసిన గెడెం నగేశ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆ స్థానం ఎవరికి కేటాయిస్తారనేది అర్థం కావడం లేదు.  ఆత్రం సక్కుకు గతంలో ఎంపీ టికెట్ కేటాయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయనకే టికెట్ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఆయన బరిలో నిలుస్తారా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి  పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.  ఆయన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కమలం పార్టీలో చేరారు. దీంతో భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎవరనేది కన్ఫ్యూజన్ గా మారింది. మరో కీలక నియోజకవర్గం నల్లగొండ. ఇక్కడి నుంచి గతంలో వేం రెడ్డి నర్సింహారెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం ఈ టికెట్ ను గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడికి కేటాయించాలని అడుగుతున్నారు. గతంలో కేసీఆర్ గుత్తాకు హామీ ఇచ్చారు. కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకుంటే గుత్తా అమిత్ రెడ్డికే టికెట్ దక్కుతుంది. అయితే  మంత్రి జగదీశ్ రెడ్డి వర్గం ఆయనకు సహకరిస్తుందా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. 

ఆ నలుగురు ఎవరంటే..?

లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశం సందర్భంగా పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ నలుగురు సిట్టింగుల పేర్లను ప్రస్తావించి బాగా వర్క్ చేసుకోవాలని సూచించారు. దీంతో వారికే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి,జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తో పాటు .. గతంలో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీ వినోద్ కుమార్ కు దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

వీళ్లకు టికెట్ కట్ చేస్తారా?

సర్వేలు, అర్థబలం ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వం కొందరు సిట్టింగులకు టికెట్ కట్ చేయనుందని సమాచారం. వారిలో వెంకటేశ్ నేతకాని( పెద్దపల్లి), పీ రాములు ( నాగర్ కర్నూల్), మన్నె శ్రీనివాస్ రెడ్డి( మహ బూబ్ నగర్), మాలోత్ కవిత ( మహబూబాబాద్), పసునూరి దయాకర్ ( వరంగల్) లను మార్చుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని తనయుడు సాయికిరణ్​ యాదవ్ కు ఈ సారి టికెట్ కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది.

 అలాగే మల్కాజ్ గిరి నుంచి గతంలో పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని బరిలోకి దించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రత్యామ్నాయంగా అభ్యర్థులున్నారా..? వారికి ఫాలోయింగ్ ఉందా..? ఎవరిని బరిలోకి దించుతారనేది సస్పెన్స్ గా మారింది. అభ్యర్థులు దొరకని చోట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​ రావు బరిలోకి దిగుతారనే  ప్రచారం కూడా ఉంది.  ఒక వేళ ఓడిపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే బాధ ఆ ఇద్దరినీ వేధిస్తోందని టాక్. ఏది ఏమైనా లోక్  సభ ఎన్నికల నుంచి ఎలా బయటపడాలనే గుబులు గులాబీ అధినాయకత్వానికి పట్టుకుంది.