ఈ ‘రూపాయిలు’ చెల్లినయ్!

ఈ ‘రూపాయిలు’ చెల్లినయ్!

హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీలో ‘చెల్లని రూపా యలు’ లోక్​సభ ఎలక్షన్లలో గెలిచినయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ముగ్గురు కాంగ్రెస్​ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలు ఇప్పుడు ఎంపీలుగా గెలిచారు. కాంగ్రెస్​ అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిన నేతలను లోక్​సభ బరిలోకి దింపడాన్ని ఎగతాళి చేస్తూ.. ‘అసెంబ్లీలో చెల్లని రూపాయిలు.. ఎంపీ పోటీలో ఏం చెల్లుతాయి’అని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వారంతా ఇప్పుడేం గెలుస్తారంటూ ఎలక్షన్​ ప్రచారంలో ఆయన సెటైర్లు వేశారు. కానీ ఆ నేతలు ఇప్పుడు ఎంపీలుగా విజయం సాధించడం గమనార్హం.

టీఆర్​ఎస్​ నుంచి కూడా..

కాంగ్రెస్‌‌ టికెట్‌‌పై చెన్నూరు అసెంబ్లీకి పోటీజేసి ఓడిన బోర్లకుంట వెంకటేశ్‌‌.. టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఇక టీడీపీ టికెట్‌‌పై ఖమ్మం అసెంబ్లీలో ఓడిన నామా నాగేశ్వరరావు ఎలక్షన్ల ముందే టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్​ క్యాండిడేట్​ రేణుకా చౌదరిని ఓడించారు.

రెండింటిలోనూ ఓడి..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి, ఎంపీ క్యాండిడేట్​గా బరిలోకి దిగిన మరో తొమ్మిది మందికి మాత్రం ఓటమి ఎదురైంది. కాంగ్రెస్‌‌ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన డీకే అరుణ.. మహబూబ్​నగర్​ లోక్​సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ టీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థి, వ్యాపారవేత్త మన్నె శ్రీనివాస్‌‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. మల్కాజ్​గిరి అసెంబ్లీ నుంచి ఓడిన బీజేపీ నేత రాంచందర్‌‌‌‌రావు.. అక్కడే ఎంపీగా పోటీజేసి రేవంత్‌‌రెడ్డిపై ఓడిపోయారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఓడిన బీజేపీ నేత రఘునందన్‌‌రావు.. మెదక్‌‌ ఎంపీగా గెలవలేకపోయారు. అసెంబ్లీ పోరులో మహబూబాబాద్‌‌లో నుంచి చవిచూసిన బీజేపీ నేత హుస్సేన్‌‌ నాయక్‌‌.. మహబూబాబాద్‌‌ లోక్​సభ సీట్లోనూ గెలవలేదు. కాంగ్రెస్‌‌ నుంచి మహబూబాబాద్​అసెంబ్లీలో ఓడిన బలరాం నాయక్‌‌  ఇక్కడ ఎంపీ సీట్లోనూ రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఖానాపూర్‌‌ అసెంబ్లీ సెగ్మెంట్​లో ఓడిన రాథోడ్‌‌ రమేశ్‌‌ ఆదిలాబాద్​ ఎంపీ సీట్లో, జడ్చర్ల అసెంబ్లీలో ఓడిన మల్లు రవి నాగర్‌‌‌‌కర్నూల్‌‌ ఎంపీ  సీట్లో పరాజయం ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌‌ రెబల్‌‌గా వికారాబాద్‌‌ అసెంబ్లీలో ఓడిన పి.చంద్రశేఖర్‌‌.. అదే పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీగా పోటీజేసి, ఓడిపోయారు.

రెండింటికీ గెలిచిన ఒక్కడు

అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ నుంచి గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి.. నల్లగొండ లోక్​సభ పోరులో విజయం సాధించడం గమనార్హం. ఇక్కడ టీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డిపై సుమారు 25 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. రాష్ట్రంలో ఈసారి ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీగా పోటీజేసింది ఉత్తమ్‌‌ ఒక్కరే. ఇప్పుడాయన ఎంపీగా వెళుతుండటంతో.. హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉప ఎన్నికపై చర్చ మొదలైంది.

ఆ ఐదుగురు..

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన రేవంత్‌‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సోయం బాపురావు, బీజేపీ నుంచి పోటీ చేసిన కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్‌‌ ఓటమి పాలయ్యారు. వీరంతా తిరిగి లోక్​సభ బరిలో నిలబడ్డారు. ఒక్క సోయం బాపురావు మాత్రం బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీకి దిగారు. కాంగ్రెస్​నుంచి ఇలా పోటీకి దిగిన నేతలపై ఎలక్షన్​ ప్రచారం సమయంలో కేటీఆర్​సెటైర్లు వేశారు. అసెంబ్లీకే గెలవలేనివారు ఎంపీగా ఏం గెలుస్తారని వ్యాఖ్యానించారు. కానీ వారు గెలిచారు.

-కరీంనగర్‌‌ అసెంబ్లీ నుంచి ఓడిన బండి సంజయ్‌‌.. ఇప్పుడు కరీంనగర్‌‌‌‌ లోక్​సభ సీట్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌ సిట్టింగ్​ బి.వినోద్‌‌పై సుమారు 90 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

-కొడంగల్‌‌లో ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్‌‌రెడ్డి ఇప్పుడు మల్కాజ్‌‌గిరి ఎంపీగా గెలిచారు. ఇక్కడ సిట్టింగ్‌‌ ఎంపీ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయడంతో.. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌‌‌‌రెడ్డికి టీఆర్ఎస్‌‌ టికెట్‌‌ ఇచ్చింది. మర్రిపై రేవంత్‌‌ ఆరు వేలకుపైగా మెజారిటీతో గెలిచారు.

-నల్లగొండ అసెంబ్లీ స్థానంలో ఓడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. భువనగిరి ఎంపీ సీట్లో టీఆర్ఎస్‌‌ సిట్టింగ్‌‌ బూర నర్సయ్యగౌడ్‌‌ను ఓడించారు.

-అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌‌‌‌పేట నుంచి స్పల్ప ఓట్ల తేడాతో ఓడిన కిషన్‌‌రెడ్డి.. సికింద్రాబాద్‌‌ లోక్​సభ సెగ్మెంట్​ నుంచి విజయం సాధించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ కుమారుడు సాయికిరణ్‌‌ యాదవ్‌‌పై సుమారు 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

-బోథ్​ సెగ్మెంట్​లో కాంగ్రెస్​ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సోయం బాపురావు లోక్​సభ ఎలక్షన్లలో బీజేపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌ సిట్టింగ్‌‌ గోడం నగేశ్‌‌పై సుమారు 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.