సినీ ఇండస్ట్రీలోకి AI హీరోయిన్.. ఛాన్స్ వస్తే ప్రపంచంలోనే తొలి ఏఐ ఫిల్మ్‌‌ స్టార్‌‌‌‌గా రికార్డ్‌‌..

సినీ ఇండస్ట్రీలోకి AI హీరోయిన్.. ఛాన్స్ వస్తే ప్రపంచంలోనే తొలి ఏఐ ఫిల్మ్‌‌ స్టార్‌‌‌‌గా రికార్డ్‌‌..

కొత్త సాంకేతికతని అందిపుచ్చుకోవడంలో సినిమా రంగం ఎప్పుడూ ముందుంటుంది. అందుకే హాలివుడ్‌‌తో పాటు బాలీవుడ్‌‌లోనూ ఏఐతో  సినిమాలు తీస్తున్నారు. కానీ.. లండన్‌‌కి చెందిన ఒక ఏఐ ప్రొడక్షన్‌‌ కంపెనీ మాత్రం ఏఐ టెక్నాలజీతో డిజిటల్‌‌ యాక్ట్రెస్‌‌ని క్రియేట్‌‌ చేసింది. దానికి అందమైన అమ్మాయి రూపాన్ని ఇచ్చి, యాక్టింగ్‌‌ ట్రైనింగ్‌‌ ఇచ్చారు. దానికి ‘టిల్లీ నార్వుడ్‌‌’ అని పేరు కూడా పెట్టారు. ఇది నిజమైన యాక్టర్లలాగే నటిస్తోంది. దాన్ని రూపొందించిన  ‘పార్టికల్‌‌ 6’ అనే కంపెనీ ఈ మధ్యే టిల్లీని ప్రపంచానికి పరిచయం చేసింది. 

అంతేకాదు.. ఇది ఇప్పటికే ‘ఏఐ కమిషనర్‌‌’ అనే కామెడీ స్కెచ్‌‌ వీడియోలో కనిపించి, అందరినీ అలరించింది. పార్టికల్‌‌ సంస్థ ప్రతినిధులు టిల్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందని చెప్తున్నారు. సినిమా అవకాశాల కోసం ఆ సంస్థ ఇప్పటికే ఎగ్జిక్యూటివ్‌‌ ఏజెంట్లతో చర్చలు మొదలుపెట్టింది. అంతేకాదు.. టిల్లీ యాక్టింగ్‌‌ స్కిల్స్‌‌ని నిర్మాతలు, డైరెక్టర్లకు చూపించేందుకు కొన్ని డెమో వీడియోలు కూడా చేశారు. వాటిలో టిల్లీ చాలా బాగా నటించింది. దీనికి సినిమా, టీవీ అవకాశాలు వస్తే.. ప్రపంచంలోనే తొలి ఏఐ ఫిల్మ్‌‌ స్టార్‌‌‌‌గా రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేస్తోందని ఏఐ ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. 

సినిమాల్లో ఏఐ టెక్నాలజీని ఎప్పటి నుంచో వాడుతున్నారు. కానీ.. ఇప్పటివరకు క్రియేట్‌‌ చేసిన ఏఐ పాత్రలు ఒక సినిమాకి, లేదంటే ఒక్క సీన్‌‌కి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ.. టిల్లీ అలా కాదు. నిజమైన యాక్టర్‌‌‌‌లాగే ఎన్ని సినిమాల్లోనైనా డిజిటల్‌‌గా నటిస్తుంది. అంటే దానికి సీన్‌‌ వివరిస్తే.. అందుకు తగ్గట్టు యాక్టింగ్‌‌ చేసి అవుట్‌‌పుట్‌‌ ఇస్తుంది. ఈ ఏఐ టెక్నాలజీని హాలీవుడ్‌‌ నటులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అది తమకు పోటీ ఇస్తుందని భయపడతున్నారు. కానీ.. ‘పార్టికల్‌‌ 6’ సీఈవో, యాక్టర్‌‌‌‌ ఎలిన్‌‌ వాన్‌‌ మాత్రం టిల్లీ నిజమైన యాక్టర్లకు ప్రత్యామ్నాయం కాదని దానివల్ల ఎలాంటి సమస్య ఉండదని వివరణ ఇచ్చింది.