పెట్రోల్ బంకులు కిటకిట.. స్టేట్ మొత్తం వాహనదారుల హైరానా

పెట్రోల్ బంకులు కిటకిట.. స్టేట్ మొత్తం వాహనదారుల హైరానా

హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో.. మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఇందులో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు సైతం ఉండటంతో.. ఇప్పుడు మహారాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ప్రతి పెట్రోల్ బంకు దగ్గర వందలాది వాహనాలు.. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాయి. దీంతో చాలా బంకుల్లో పెట్రోల్, డీజిల్ అయిపోయింది. నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

ముంబై, థానే, నాగపూర్, పూణె, నాసిక్ తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఆయిల్ డిపోల నుంచి 900 నుంచి 12 వందల ట్యాంకర్లు.. పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా చేస్తుంటాయి. ప్రస్తుతం వీటిలో కేవలం 250 ట్యాంకర్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఇవి కూడా నిలిపివేస్తామని ప్రకటించాయి ట్యాంకర్ యజమానుల సంఘం. దీంతో మరో 24 గంటల్లో అంటే.. జనవరి 3వ తేదీ నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు ఖాళీ అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో లారీ యజమానుల సంఘాలతో చర్చలు జరుపుతుంది. అత్యవసరం కింద ఆయిల్ ట్యాంకర్లను మినహాయించాలని కోరుతుంది. దీనిపై యజమానులు వెనక్కి తగ్గటం లేదు. ఈ విషయం తెలిసిన వాహనదారులు.. తమ బైక్స్, కార్లకు ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు. దీంతో వేగంగా ఖాళీ అవుతున్నాయి బంకులు.

హిట్ అండ్ రన్ కేసు విషయానికి వస్తే.. చట్టంలో మార్పుల తర్వాత.. ఎవరినైనా వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోతే.. ఆ కేసులో 10 లక్షల జరిమానా, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించే విధంగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీన్ని ట్రక్, లారీ, క్యాబ్ డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో కేవలం ట్రక్, లారీ డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేసే విధంగా చట్టం ఉందని.. ఇందులో బాధితుల తప్పు ఎందుకు ఉండదని ప్రశ్నిస్తున్నారు ట్రక్ యజమానులు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు నిరసన వ్యక్తం చేస్తామని.. దేశ వ్యాప్తంగా ట్రక్, లారీ ట్రైవర్ల సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు.