ఎక్కువ పని గంటలతో గుండెకు తీవ్ర ముప్పు

ఎక్కువ పని గంటలతో గుండెకు తీవ్ర ముప్పు

జెనీవా: రోజులో ఎక్కువ గంటలు పని చేసే వారికి హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. సాధారణ పనిగంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. వారంలో ఎక్కువ గంటలు పని చేస్తున్న వారిపై డబ్ల్యూహెచ్ఓ ఓ పరిశోధన నిర్వహించింది. దీని ప్రకారం.. ఎక్కువ పని గంటలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ పని వేళల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది మంది చనిపోతున్నారని ఆ స్టడీలో తేలింది. ఒక్క 2016లోనే అధిక పని వల్ల సుమారుగా 7.5 లక్షల మంది మృతి చెందారని డబ్లూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ తరహా మరణాలు 2000వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది 30 శాతం మేర పెరుగుతున్నాయని పేర్కొంది. 

సగటున వారానికి 55 గంటల కంటే ఎక్కువ సేపు పని చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని డబ్ల్యూహెచ్ఓ ఎన్విరాన్ మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మరియా నెయిరా హెచ్చరించారు. ఈ విషయం గురించి సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ స్పందిస్తూ.. కరోనా కారణంగా ప్రతి రంగంలో వచ్చిన ఒడుదొడుకులను ఎదుర్కొనేందుకు ఎక్కువ మంది అధిక పనిగంటలు చేస్తున్నట్లు తాము గుర్తించామని తెలిపారు. శ్రామికులు, వర్కర్లకు ఆరోగ్యం గురించి అన్ని సంస్థలూ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కాగా, అధిక పని వేళలతో చైనా, జపాన్, ఆస్ట్రేలియాల్లో వర్కర్లు ఒత్తిడికి గురవుతున్నారని ఇంటర్నేషనల్ లేబర్స్ ఆర్గనైజేషన్, డబ్ల్యూహెచ్ఓ సంయుక్తంగా నిర్వహించిన స్టడీలో బయటపడింది.