కరోనాతో 14 నెలలు పోరాడి.. చివరకు మృతి

కరోనాతో 14 నెలలు పోరాడి.. చివరకు మృతి
  • కరోనాతో 14 నెలలు పోరాడిండు.. చివరకు ట్రీట్‌‌‌‌మెంట్ వద్దన్నడు
  • బ్రిటన్ ‘లాంగెస్ట్ కరోనా పేషెంట్’ మృతి 
  • డయాబెటిస్, అస్తమా, కిడ్నీ డిసీజెస్‌‌‌‌తో కోలుకోలేకపోయిన జేసన్ కెల్క్ 

లండన్: కరోనా మహమ్మారి ఎవరిని ఎట్ల పీడిస్తదో.. ఎవరిని ఎప్పుడు వదిలిపెడ్తదో.. ఎవరిని ఎట్ల బలి తీసుకుంటదో.. చెప్పలేని పరిస్థితి. చాలామందికి ఎలాంటి సింప్టమ్స్ కన్పించకుండానే వైరస్ వచ్చి పోతోంది. కొందరికి వారాల్లోనే సింప్టమ్స్ పోతున్నాయి. మరికొందరికి మాత్రం వైరస్ వచ్చిపోయిన తర్వాత కూడా వారాలు.. నెలల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. అలా.. బ్రిటన్​లో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి ఏకంగా 14 నెలల పాటు దవాఖానలోనే ఉన్నడు. బ్రిటన్ ‘లాంగెస్ట్ కరోనా’ పేషెంట్​గా వార్తల్లోకి వచ్చిన జేసన్ కెల్క్(49) అనే ఆ పేషెంట్ చివరకు విసిగిపోయి.. ఇసొంటి జీవితం ఇక వద్దనుకున్నాడు. అన్ని ట్రీట్ మెంట్లనూ ఆపేసి శుక్రవారం లీడ్స్ సిటీలోని ఓ హాస్పిటల్​లో ప్రాణాలు వదిలాడు.  

నిరుడు మార్చి 31 నుంచీ..
జేసన్ ఓ ప్రైమరీ స్కూల్ లో ఐటీ టీచర్ గా పనిచేసేవారు. ఆయనకు కరోనా సోకి సీరియస్ కావడంతో నిరుడు మార్చి 31న లీడ్స్ లోని సెయింట్ జేమ్స్ హాస్పిటల్ లో చేర్చారు. అప్పటి నుంచి పద్నాలుగున్నర నెలలుగా జేసన్ అదే హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ పొందారు. టైప్ టూ డయాబెటిస్, అస్తమా కారణంగా ఆయనకు కరోనా తర్వాత హెల్త్ సమస్యలు ఏమాత్రం తగ్గలేదు. కిడ్నీలు పాడయ్యాయి. ఊపిరితిత్తుల కెపాసిటీ తగ్గి శ్వాస ఇబ్బంది అయింది. కడుపులోనూ ఇబ్బందులు, వాంతులు మొదలయ్యాయి. చివరకు ఒక్కడే లేచి నడవలేని స్థితికి వచ్చారు. గురువారం పరిస్థితి మరింత సీరియస్ కావడంతో లీడ్స్ సిటీలోనే మరో దవాఖానకు తరలించారు. ఇంకెన్ని రోజులు ఇలా బతకాలని అనుకున్న జేసన్ ట్రీట్ మెంట్ ఆపేయడంతో తుదిశ్వాస విడిచారు. జేసన్ చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆయన చాలా ధైర్యవంతుడని అతడి భార్య సూ కెల్క్ కన్నీటి నివాళి అర్పించారు. 

కరోనా లాంగ్ టర్మ్ సింప్టమ్స్ ఇవే.. 
కరోనా సోకినోళ్లలో చాలా మంది 15 రోజుల్లో రికవరీ అవుతారని, జ్వరం, దగ్గు, వాసన, రుచి పోవడం మరికొన్ని రోజులు ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. కొందరిలో మాత్రం చాలా కాలంపాటు సమస్యలు కొనసాగుతాయని అంటున్నారు. ప్రతి 10 మంది బాధితుల్లో ఒకరికి మూడు వారాలకు మించి సింప్టమ్స్ ఉండొచ్చని, కొందరికి నెలల తరబడి కొనసాగొచ్చని కింగ్స్ కాలేజ్ లండన్ సైంటిస్టులు పేర్కొంటున్నారు.