డాక్యుమెంటరీ చూసి.. రోబో చేయి చేసిండు

డాక్యుమెంటరీ చూసి.. రోబో చేయి చేసిండు

చిన్నప్పుడు చూసిన, విన్న విషయాలు పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తాయి. అందుకు ఉదాహరణ... ఈ 17 ఏండ్ల అబ్బాయి. పేరు బెంజమిన్ చోయ్. అమెరికాలోని వర్జీనియాలో ఉంటాడు. చిన్నప్పుడు ఒక డాక్యుమెంటరీలో రోబోటిక్ హ్యాండ్​ని చూశాడు. అందులో చూపించిన ప్రోస్తటిక్​ టెక్నాలజీ అతనికి చాలా కొత్తగా అనిపించింది.  దాంతో తను కూడా అలాంటి చేతిని తయారుచేయాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే.. బ్రెయిన్ సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండానే మెదడు ఆదేశాలతో పనిచేసే ప్రోస్తటిక్ హ్యాండ్ డిజైన్ చేశాడు.  థర్డ్​గ్రేడ్ చదువుతున్నప్పుడు ‘‘60 మినిట్స్​’ అనే డాక్యుమెంటరీ చూశాడు బెంజమిన్. అందులో రోబోటిక్ హ్యాండ్ ఉన్న వ్యక్తి మెదడులోని సెరిబ్రమ్​లో చిన్న సెన్సర్​ పెడతారు రీసెర్చర్లు.  ఆ కాన్సెప్ట్ బెంజమిన్​కు చాలా నచ్చింది. “కృత్రిమంగా శరీర భాగాల్ని తయారుచేసి, అమర్చే టెక్నాలజీ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అయితే, సెన్సర్ పెట్టడం కోసం బ్రెయిన్ సర్జరీ చేయడం అనేది చాలా రిస్క్​. అన్నిసార్లూ సక్సెస్ కాదు. సర్జరీకి  వేల డాలర్లు కావాలి. అలాకాకుండా సర్జరీ అవసరం లేకుండా మెదడు ఆదేశాలతో పనిచేసే ప్రొస్తెటిక్ హ్యాండ్ తయారుచేయాలి” అనిపించేది బెంజమిన్​కు. అందుకని కంప్యూటర్​ లాంగ్వేజ్, అల్గారిథమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పట్టు పెంచుకోవాలి అనుకున్నాడు. తొమ్మిదో క్లాస్​లో ఒక  కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వెబ్​సైట్​లో వీడియోలు చూసి  పైతాన్, సి++  లాంగ్వేజ్​లు నేర్చుకున్నాడు.  
 

లాక్​డౌన్​లో టైం దొరికింది
ఇప్పుడు బెంజమిన్ పదో క్లాస్ చదువుతున్నాడు. వేసవి సెలవుల్లో అల్యూమినియం ఫ్యూయెల్ మీద రీసెర్చ్​ చేయాలి అనుకున్నాడు. కానీ, అంతలోనే లాక్​డౌన్ అవ్వడంతో ఆ ల్యాబ్ మూతపడింది.  ఆ టైంలో ఏం చేయాలని ఆలోచిస్తుంటే... చిన్నప్పుడు చూసిన డాక్యుమెంటరీ గుర్తుకొచ్చింది. అంతే.. ప్రోస్తటిక్ హ్యాండ్ తయారుచేయాలని అనుకున్నాడు. అందుకోసం తాను టేబుల్​ టెన్నిస్​ ఆడే టేబుల్​నే ల్యాబ్​గా మార్చుకున్నాడు బెంజమిన్. స్కూల్లో జరిగే రోబోటిక్స్ తయారీ, కోడింగ్ పోటీల్లో పాల్గొన్న ఎక్స్​పీరియెన్స్ కూడా అతనికి ఉపయోగపడింది. 
 

75 డిజైన్ల ​ తర్వాత...
తన సిస్టర్​ దగ్గర 3–డి ప్రింటర్, చేపల్ని పట్టేందుకు ఉపయోగించే గాలం తీగ సాయంతో  రోబోటిక్​ హ్యాండ్  తయారుచేశాడు. అయితే, ఆ 3–డి ప్రింటర్​తో4.75 ఇంచుల చేతిని మాత్రమే ప్రింట్ చేయొచ్చు. దాంతో, చేతిని చిన్న భాగాలుగా ప్రింట్ చేశాడు. నట్లు, రబ్బర్ బ్యాండ్​తో వాటిని జతచేసి, పెద్ద చేతిని తయారుచేశాడు బెంజమిన్.  అందుకోసం 30 గంటలు కష్టపడ్డాడు. అయితే, 75 డిజైన్ల తర్వాతే మైండ్ కంట్రోల్డ్​ ప్రోస్తటిక్ హ్యాండ్ సాధ్యమైంది.  దీని తయారీ గురించిన సమాచారాన్ని ఇంటర్నెట్​లో కూడా పెట్టాడు. 
 

ఎలా పనిచేస్తుందంటే...
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ ద్వారా పనిచేసే అల్గారిథం సాయంతో ఈ ప్రొస్తెటిక్​ హ్యాండ్​ కదులుతుంది. ఎలక్ట్రోఎన్​సెఫలోగ్రఫీ (ఇఇజి)ని కూడా ఉపయోగించుకుంటుంది. ఈ చేతిలో ఉన్న సెన్సర్ల సాయంతో ఇఇజి డివైజ్​ మెదడు తరంగాల్ని రికార్డ్ చేస్తుంది. ఈ చేయి నాలుగు టన్నుల బరువు మోయగలదు. ధర మూడొందల డాలర్లు. ఈ ఇన్నొవేషన్​తో ఈ ఏడాది ‘రీజెనెరన్ సైన్స్ టాలెంట్ సెర్చ్​’లోని 40 మంది ఫైనలిస్ట్​ల్లో చోటు దక్కించుకు న్నాడు బెంజమిన్. అమెరికాలో హైస్కూల్ స్టూడెంట్స్​ పాల్గొనే ముఖ్య మైన సైన్స్, మ్యాథ్స్​ కాంపిటీషన్​ ఇది.